IASను..హెచ్చరించిన రేవంత్ రెడ్డి

ఓఆర్ఆర్ లీజుకు సంబంధించిన వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ మే 25న తనకు ఇచ్చిన లీగల్ నోటీసులను వెనక్కి తీసుకోకుంటే ఆయనపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఓఆర్ఆర్ లీజుకు సంబంధించిన వ్యవహారంలో అరవింద్ కుమార్ పంపిన లీగల్ నోటీసుకు రేవంత్ తన అడ్వకేట్ ద్వారా రిప్లై ఇచ్చారు. అరవింద్ కుమార్ ఐఏఎస్.. మున్సిపల్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ, మెట్రోపాలిటన్ కమిషనర్ వంటి శాఖల్లో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒక ఐఏఎస్ అధికారి ఏ విధంగా వ్యవహరించాలి, బాధ్యతలను ఎలా నిర్వహించాలి అనే విషయంలో సర్వీస్ రూల్స్ ఉన్నాయి. కానీ అరవింద్ కుమార్ ఆ రూల్స్ పాటించకుండా అడిగిన సమాచారం ఇవ్వకుండా ఫక్తు రాజకీయ నాయకుడిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
అధిక ఆదాయం వచ్చే ఆస్కారం ఉన్నా ఆ దిశగా అలోచన చేయకుండా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి కేవలం 7380 కోట్లకే ఐఆర్బీ సంస్థకు 30 ఏళ్లకు ఓఆర్ఆర్ టోల్ వసూలు టెండర్ కట్టబెట్టారన్నారు. ఐఆర్బీ టెండర్ కట్టబెట్టే క్రమంలో అన్ని నిబంధనలు యాదేచ్ఛగా ఉల్లంఘించారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఐఏఎస్ అధికారి స్థానంలో ఒక రిటైర్డ్ ఆఫీసరును నియమించి ఓఆర్ఆర్ టెండర్ ప్రక్రియను పూర్తి చేశారన్నారు. ఓఆర్ఆర్ పై ట్రాఫిక్, టెండర్ విలువను మదింపు చేసిన మజర్స్ నివేదికను కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టడం లేదన్నారు. అడిగిన సమాచారానికి సమాధానం ఇవ్వకుండా అరవింద్ కుమార్ రాజకీయ నాయకుడి మాదిరిగా ఎదురు దాడికి దిగుతున్నారని... లీగల్ నోటీసులో తనపై పేర్కొన్న ఆరోపణలన్నీ బూటకమని రేవంత్ పేర్కొన్నారు. అరవింద్ కుమార్ పంపిన లీగల్ నోటీసు ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. అధికార పార్టీ అక్రమాలపై ప్రశ్నిస్తున్నందుకుగాను అణిచివేసే క్రమంలో ఈ నోటీసు ఇచ్చినట్లు తోస్తుందన్నారు. తనకు నోటీసులిచ్చినా ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com