Revanth Reddy: సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..

Revanth Reddy: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం అక్కంపేట అభివృద్ధి విషయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని లేఖలో తెలిపారు. ఎంతో మంది ప్రజాప్రతినిధులు ఈ గ్రామాన్ని సందర్శించి అభివృద్ధి కోసం హామీలు ఇచ్చినా.. అవి నీటి మూటలుగానే మారాయని ఆరోపించారు. అక్కడి పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయని.. ఇప్పటికీ రెవెన్యూ విలేజ్ హోదా ఇవ్వకపోవడం అత్యంత విచారకరమన్నారు.
అక్కంపేట గ్రామానికి కనీసం మిషన్ భగీరథ నీళ్లు కూడా రావడం లేదని మండిపడ్డారు. ఇక వరంగల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతుల వ్యధలు ప్రభుత్వానికి పట్టడంలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి వ్యతిరేకం కాదని.. కానీ ఓఆర్‌ఆర్ ప్రాజెక్టు మాత్రం పచ్చని పొలాల్లో చిచ్చు పెడుతోందని లేఖలో పేర్కొన్నారు. అలాగే దళిత బంధుపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప.. దళితుల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. దళిత కుటుంబాలకు తక్షణం డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com