REVANTH: తొలి సైనిక్ స్కూల్‌కు నేడు రేవంత్ భూమిపూజ

తెలంగాణలో తొలి సైనిక్ స్కూల్ ఏర్పాటు కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం వికారాబాద్ జిల్లా కొడంగల్ పరిధిలోని దుద్యాల మండలం హకీంపేట వద్ద ఉన్న ఎడ్యుకేషన్ హబ్‌లో ఈ ప్రతిష్ఠాత్మక పాఠశాల ఏర్పాటు కానుంది. కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సైనిక్ స్కూల్ సొసైటీ ఈ పాఠశాలను అధికారికంగా మంజూరు చేయాల్సి ఉన్నా.. ఈ నెల 21న వచ్చిన నిపుణుల కమిటీ స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. దీనికి అనుగుణంగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఈ స్కూల్‌కు భూమిపూజ చేయనున్నారు. ఈ సైనిక్ స్కూల్‌ను కేంద్రం ప్రవేశపెట్టిన పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ పాఠశాలకు అవసరమైన 11 ఎకరాలకు పైగా స్థలం కేటాయింపు, భవనాల నిర్మాణం, ఇతర నిర్వహణ ఖర్చులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. అన్ని నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తయితే.. కేంద్ర ప్రభుత్వం పీపీపీ విధానంలో ఈ పాఠశాలను మంజూరు చేస్తుంది. సైనిక్ స్కూళ్లు విద్యార్థులకు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు (12వ తరగతి) నాణ్యమైన విద్యను అందిస్తాయి. ఈ పాఠశాలల్లో కేవలం అకడమిక్ చదువులే కాకుండా.. క్రీడలకు, శారీరక దృఢత్వానికి సమ ప్రాధాన్యం ఇస్తారు.
క్రమశిక్షణకు పెద్దపీట
విద్యార్థులను జాతీయ రక్షణ అకాడమీ వంటి రక్షణ దళాలలో చేరేందుకు సిద్ధం చేయడమే ఈ స్కూళ్ల ముఖ్య లక్ష్యం. ఈ లక్ష్యం నెరవేరేందుకు పాఠ్యాంశాలతో పాటు ప్రత్యేక శిక్షణ, క్రమశిక్షణతో కూడిన వాతావరణం ఉంటుంది.
ప్రవేశం పొందటం ఎలా..?
సైనిక్ స్కూళ్లలో ప్రవేశం పొందడానికి దేశవ్యాప్తంగా ఒకే ఉమ్మడి పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్షను అఖిల భారత సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష ( AISSEE ) అంటారు. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తుంది. విద్యార్థులు ముందుగా AISSEE పరీక్షలో మెరిట్ సాధించాల్సి ఉంటుంది. రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు సైనిక్ స్కూల్ సొసైటీ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. రాత పరీక్ష మెరిట్, వైద్య పరీక్షలో అర్హత, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది మెరిట్ జాబితాను రూపొందిస్తారు. కొత్తగా పీపీపీ విధానంలో 40 శాతం అడ్మిషన్లు AISSEE ద్వారా వచ్చిన మెరిట్ విద్యార్థులకు కేటాయిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

