REVANTH: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతం కట్: రేవంత్

తెలంగాణ గడ్డకు ఓ చరిత్ర, పౌరుషం ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కాలం కలిసి వచ్చి గెలిస్తే గత పాలకులు తాము కారణజన్ములం అనుకున్నారని, విశ్వాసంతో ప్రజలు అధికారమిస్తే.. విశ్వాసఘాతకులుగా మారారని మండిపడ్డారు. శిల్పకళా వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రూప్-1 విజేతలకు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. 3 లక్షల మందితో పోటీ పడి... 562 మందిలో ఒకరిగా మీరంతా నిలిచారని విజేతలను కొనియాడారు. మీరే తెలంగాణ భవిష్యత్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ఆరు దశాబ్ధాల పాటు జరిగిన ఉద్యమాన్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంత్ చారి, ఇషాన్ రెడ్డిలను స్మరించారు. రాష్ట్రాన్ని ఒక కుటుంబం, ఒక పార్టీ సొత్తు అనుకునే రోజులు ముగిశాయని ఆయన వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో గ్రూప్-1 పరీక్షలు నిర్వహించని పూర్వ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. నియామకాల విషయంలో పారదర్శకత పాటించక ఐదు కోట్లు తీసుకుని ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపించారు.
ఉద్యోగులు జర భద్రం
కోచింగ్ సెంటర్ల కుట్రలపై కూడా అభ్యర్థులను అప్రమత్తం చేశారు. లక్షల రూపాయలు పెట్టి కేసులు వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ మోడల్‌ను మనం సృష్టించాలని, గుజరాత్ మోడల్‌ను అనుసరించాల్సిన అవసరం లేదని అన్నారు. ఉద్యోగులు ప్రజాసేవలో తల్లిదండ్రులను గుర్తు చేసుకోవాలని సీఎం సూచించారు. త్వరలో తల్లిదండ్రుల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని, వారి పట్ల నిర్లక్ష్యం కనబరిస్తే జీతం నుండి 10 శాతం కోసి తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేస్తామని ఆయన ప్రకటించారు. “మీ కళ్లల్లో కంటే, మీ తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూడాలని నేను కోరుకుంటున్నాను. టీజీపీఎస్సీ రాజకీయ పునరావాస కేంద్రం కాదు.. తెలంగాణ పునర్నర్మాణ కేంద్రం” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com