REVANTH: దక్షిణ కుంభమేళాను ఘనంగా నిర్వహించాలి

గోదావరి, కృష్ణా పుష్కరాల నిర్వహణపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో టెంపుల్ సెంట్రిక్ ఘాట్స్ అభివృద్ధిపై పలు కీలక సూచనలు చేశారు. శాశ్వత ప్రాతిపదికన సెంట్రిక్ ఘాట్స్ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. టెంపుల్ సెంట్రిక్ ఘాట్స్ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రముఖ ఆలయాలను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని శాశ్వత ఘాట్స్ నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి మార్గనిర్దేశం చేశారు. సీఎంతో పాటు మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ధార్మిక సలహాదారు గోవింద హరి తదితరులు పాల్గొన్నారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహకంలోని ఆలయాలను క్షేత్రస్థాయిలో సందర్శించి అనువైన వాటిని ఎంపిక చేయాలని సూచించారు సీఎం రేవంత్‌రెడ్డి. బాసర, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలంతోపాటు ఇతర ప్రముఖ ఆలయాలను సందర్శించి ప్రత్యేకంగా జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారుల సమీపంలో ఉన్న గోదావరి పరివాహక ఆలయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు.
2027 జులై 23 నుంచి...
2027లో జులై 23వ తేదీ నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఇప్పటి నుంచి దాదాపు 22 నెలల వ్యవధి ఉన్నందున శాశ్వతమైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణలో ప్రవేశించే గోదావరి నదికి రాష్ట్రంలో 560 కిలోమీటర్ల తీర ప్రాంతముంది. దాదాపు 74 చోట్ల పుష్కర ఘాట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరముంటుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం ఉన్న ఘాట్స్‌ను విస్తరించడంతోపాటు రోడ్లు, ఇతర సౌకర్యాలను శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి. పుష్కరాల సమయంలో దాదాపు రెండు లక్షల మంది ఒకేసారి ఘాట్స్ వద్ద స్నానమాచరించేందుకు వీలుగా ఉండేలా అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. ప్రతీ ఆలయానికి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వేర్వేరుగా ఘాట్స్ డిజైన్లు రూపొందించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. మహా కుంభమేళాతో పాటు గతంలో వివిధ రాష్ట్రాల్లో పుష్కరాలు, ఆలయాల అభివృద్ధి, భక్తులకు అవసరమైన సౌకర్యాల రూపకల్పనలో అనుభవమున్న కన్సల్టెన్సీలను నియమించుకోవాలని ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com