REVANTH: ముప్పు పొంచి ఉంది..నిర్లక్ష్యం వద్దు

తెలంగాణలో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పలు జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాలైన ఉత్తర తెలంగాణలోని పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించి, పరిస్థితిని సమీక్షించారు. అయితే తీవ్ర వరద ప్రభావిత ప్రాంతం అయిన కామారెడ్డి పట్టణం మొత్తం వరద గుప్పిట్లో మునిగిపోవడంతో సీఎం హెలికాఫ్టర్ ల్యాండ్ అయ్యే పరిస్థితి లేక.. మెదక్ పట్టణంలో దిగాల్సి వచ్చింది. మెదక్ ఎస్పీ కార్యాలయంలో వరద పరిస్థితిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కామారెడ్డి, మెదక్ జిల్లాలకు ఇంకా వరద ముప్పు పోలేదని, అధికారులంతా అప్రమత్తంగా ఉండాల్సిందేనని సీఎం స్పష్టం చేసారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని, పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి నివేదిక ఇవ్వాలని సూచించారు. రోడ్లు తెగిన చోట యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేసి రవాణా సౌకర్యం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. ఆయా ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రతను, తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
ఎల్లంపల్లి ప్రాణవాయువు
గోదావరి జలాలను తెలంగాణలో ఎక్కడికి తరలించాలన్నా ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రాణవాయువు లాంటిదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్‌తో కలిసి ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహాన్ని పరిశీలించిన అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. స్ట్రాటజిక్ లోకేషన్‌తో కట్టిన ప్రాజెక్టు శ్రీపాద ఎల్లంపల్లి అని.. కూలిపోయిన ప్రాజెక్టు, నిలబడిన ప్రాజెక్టుకు మధ్య తేడా ఉందన్నారు. నిపుణులు కట్టిన ప్రాజెక్టు కాబట్టే ఎల్లంపల్లి దశాబ్దాలుగా నిలబడిందని పేర్కొన్నారు. మేడిగడ్డ పనికిరాకుండా పోయింది. మేడిగడ్డ రిపేరు చేయకుండా.. అన్నారం, సుందిళ్లలో నీరు నిల్వ చేయొచ్చు కదా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సీఎం సమాధానమిచ్చారు. "మామ, అల్లుడు .. ఒకరు స్వాతి ముత్యం, మరొకరు ఆణిముత్యం అనుకుంటారు. మేడారం, అన్నారం, సుందిళ్ల.. మూడు బ్యారేజీలు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో నిర్మించారు. మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తి అన్నారంలో పోయాలి, అక్కడి నుంచి సుందిళ్ల, శ్రీపాద ఎల్లంపల్లిలో పోయాలి. ఏదైనా ప్రమాదం జరిగేతే గ్రామాలకు గ్రామాలు తుడిచిపెట్టుకుపోతాయి.” అని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com