REVANTH: బీసీ రిజర్వేషన్లకు ఆ పార్టీలే అడ్డంకి

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో కులగణన చేపట్టిందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆ సర్వే లెక్కల ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, పలువురు మంత్రులతో కలిసి సీఎం మాట్లాడారు. ‘‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు రూపొందించి రాష్ట్రపతికి పంపాం. ఆ రిజర్వేషన్లపై పోరాడేందుకే ఢిల్లీకి వచ్చాం. జంతర్ మంతర్ వద్ద మహా ధర్నా నిర్వహించి కేంద్రాన్ని నిలదీశాం. గల్లీలో కాదు.. ఢిల్లీలోనే తేల్చుకుందామని దేశ రాజధానికి వచ్చాం. ఈ ధర్నాకు 100 మంది ఎంపీలు మద్దతు ఇచ్చారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ రాకుండా ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా అడ్డుకున్నారు. ఆ అపాయింట్మెంట్ కోసం మంత్రివర్గం మొత్తం ఎదురు చూస్తోంది. రాష్ట్రపతిని కలిసే అవకాశం మాకు ఇవ్వకపోవడం శోచనీయం. ముస్లిం రిజర్వేషన్ల సాకుతో ఓబీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు బీజేపీ చూస్తోంది." అని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రిజర్వేషన్లలో విద్యా ఉద్యోగ అవకాశాలకు మాత్రమే వర్గీకరణ ఉంటుందని, ఆయన చెప్పినట్లు ప్రత్యేక వర్గానికి రిజర్వేషన్లేం లేవని అన్నారాయన. కిషన్ రెడ్డి ముందుగా చట్టం చదవాలి. రాజకీయ ఓబీసీ రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ లేదు. బీసీఈ గ్రూపుకు ఇప్పటికే నాలుగు శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. అలాంటప్పుడు కొత్తగా 10% రిజర్వేషన్లు ఎక్కడి నుంచి వచ్చాయి. కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు’’ అని సీఎం రేవంత్ అన్నారు.
మీ సర్టిఫికెట్ అవసరం లేదన్న రేవంత్
"రిజర్వేషన్ సాధన కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నామని రేవంత్ ఉద్ఘాటించారు. ‘‘బీసీ రిజర్వేషన్లు 42 శాతం ఇవ్వాలన్నది మా కమిట్మెంట్. మా కమిట్మెంట్కు విపక్షాల సర్టిఫికెట్ అవసరం లేదు. జంతర్ మంతర్ వేదికగా మావాయిస్ బలంగా వినిపించాం. మా ఆఖరి పోరాటాన్ని పూర్తి చేశాం. నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రంలోని బీజేపీనే. బీసీలపై అంత ప్రేమ ఉంటే కేంద్రం వెంటనే బిల్లు ఆమోదించాలి. అబద్ధాలతో ప్రజల్ని మభ్య పెట్టడం బీఆర్ఎస్ నైజం. లోకల్‌బాడీ ఎన్నికలు సెప్టెంబర్ 30లోపు నిర్వహించాలని హైకోర్టు చెప్పింది. ఆలోపు బీసీ రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం తెలపకపోతే ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై ఆలోచన చేస్తాం. ప్రజల అభిష్టం మేరకే పార్టీ నిర్ణయం ఉంటుంది’’ అని రేవంత్ స్పష్టం చేశారు. విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు క్షేత్రస్థాయిలో మేము చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశామని రేవంత్ రెడ్డి అన్నారు. బలహీన వర్గాల హక్కులను కాలరాయడానికి బీజేపీ మొదటి నుంచి కుట్రలు చేస్తూనే ఉందని సీఎం విమర్శించారు. నాడు మండల్ కమిషన్ ద్వారా ఓబీసీలకు న్యాయం చేయాలని చూస్తే బీజేపీ కమండల్ పాలిటిక్స్ కు తెరలేపిందని రథయాత్ర పేరుతో దేశంలో ఉద్రిక్తత పరిస్థితులు తీసుకువచ్చిందని ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com