REVANTH: దేవాదుల సాక్షిగా చర్చలే కోరుకుంటున్నాం

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీ అంశం దశాబ్దాలుగా కొనసాగుతున్న కీలక సమస్యగా నిలిచింది. విభజన తర్వాత ఈ వివాదం మరింత ప్రాధాన్యత సంతరించుకుని, ఇరు రాష్ట్రాల అభివృద్ధి ప్రణాళికల్లో ప్రధాన అంశంగా మారింది. జలాల విషయంలో ఘర్షణల కంటే చర్చల ద్వారానే శాశ్వత పరిష్కారం సాధ్యమని నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో, ఈ అంశంపై రాజకీయ ప్రకటనలు కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో స్పందించారు. దేవాదుల ప్రాజెక్టును సాక్షిగా ఉంచుకుని కృష్ణా, గోదావరి జలాల విషయంలో తమ వైఖరిని స్పష్టం చేశారు. వివాదాలకంటే పరిష్కారమే తమ లక్ష్యమని, పంచాయితీల కంటే చర్చల ద్వారానే ముందుకు సాగాలని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి తాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు అందించడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. జలాల సాధనలో రాజీలేని పోరాటం చేస్తూనే, స్నేహపూర్వక వాతావరణంలో సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
ఇటీవల దేవాదుల ప్రాజెక్టు సందర్శన సందర్భంగా కూడా సీఎం ఇదే భావనను వ్యక్తం చేశారు. కృష్ణా, గోదావరి జలాల వాటాలపై రాష్ట్రాల మధ్య తలెత్తే అభిప్రాయ భేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. విభజన చట్టం ప్రకారం కృష్ణా నదీ జలాల్లో తాత్కాలికంగా ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించబడ్డాయి. అయితే సమాన వాటా కావాలనే డిమాండ్‌ను తెలంగాణ మొదటి నుంచీ వినిపిస్తోంది. ఈ వివాదాల పరిష్కారానికి కృష్ణా ట్రైబ్యునల్ (బృజేష్ కుమార్ ట్రైబ్యునల్) విచారణ జరిపింది. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయాలన్నది తెలంగాణ అభిప్రాయం.ఇక శ్రీశైలం, నాగార్జున సాగర్ నిర్వహణ అంశంపై తరచూ వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ ప్రాజెక్టులను కృష్ణ రివర్ మేనేజ్ మెంట్ బోర్డు పరిధిలోకి తీసుకురావాలని కేంద్రం ఆదేశించడం కూడా చర్చనీయాంశమైంది.
కొనసాగుతున్న విభేదాలు
జలాల విషయంలోనూ ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ చేపట్టిన కాళేశ్వరం వల్ల తమకు వచ్చే నీటి ప్రవాహం తగ్గుతుందనే ఆందోళన ఏపీ వ్యక్తం చేస్తుండగా, ఏపీ నిర్మిస్తున్న పోలవరం ఎత్తు, ముంపు ప్రభావాలపై తెలంగాణ అభ్యంతరాలు తెలుపుతోంది. అదనంగా పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై కూడా తెలంగాణ కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదు చేసింది.ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కొత్త దారితీస్తాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఈ ప్రకటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది చూడాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
