REVANTH: మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం: రేవంత్

మూసీ ప్రక్షాళన చేస్తామంటే కొందరు వద్దని అంటున్నారని.. ఈ నగరాన్ని ఇలాగే వదిలేద్దామా.. ప్రపంచానికి ఆదర్శంగా హైదరాబాద్ ను నిలుపుకుందామా? వద్దా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ మహానగరాభివృద్ధిలో చాలా మంది ప్రముఖుల పాత్ర ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన గచ్చిబౌలిలోని ఇంటిగ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు ఇక్కడి నుంచే పని చేయడం మనందరికీ గర్వకారణమని అన్నారు. చంద్రబాబు, వైఎస్ఆర్లు కూడా హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు. ఇక దేశంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి వెనుకు స్వర్గీయ రాజీవ్ గాంధీ పాత్ర కూడా ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే హైటెక్స్ సిటీకి పునాది రాయి పడిందని, ఆ తరువాత దాని నిర్మాణాన్ని చంద్రబాబు కొనసాగించారని గుర్తు చేశారు. హైదరాబాద్ అభివృద్ధిలో ఉమ్మడి రాష్ట్రంలో సీఎంలుగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్ర ఉందని వెల్లడించారు. 1994 నుంచి 2014 వరకు హైదరాబాద్‌ను అప్పటి సీఎంలు అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. గూగుల్‌లాంటి ప్రముఖ సంస్థల్లో తెలుగువారు పెద్ద పదవుల్లో ఉన్నారని తెలిపారు. మన ప్రాంత విద్యార్థులు ఇక్కడే చదువుకోవాలని పలు సంస్థలు నిర్మించారని గుర్తు చేశారు.
అప్పుడు... ఇప్పుడు అవహేళనలే
‘‘హైటెక్ సిటీ కట్టినప్పుడు అవహేళన చేశారు. హైదరాబాద్ నగరం సింగపూర్, టోక్యోతో పోటీ పడుతోంది. మన వద్ద అన్ని ఉన్నప్పుడు చిత్తశుద్ధితో పనిచేయడం కావాలి. అమెరికాలో మన ఐటీ నిపుణులు పని చేయడం ఆపేస్తే స్తంభించిపోతుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలతో కూడిన ఉద్యోగ భద్రత ఇచ్చాం. రాబోయే పదేళ్లలో వన్ బిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దుతాం. ఇప్పుడు మూసీ ప్రక్షాళన ఎందుకు అడ్డుకుంటున్నారు. మూసీ మురికిలో బతకాలని పేదలు ఎందుకు అనుకుంటారు? తెలంగాణ రైజింగ్ 2047తో అభివృద్ధి చేసుకుందాం. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన జరగాలి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సరైన సౌకర్యాలు లేవు. అన్ని సౌకర్యాలతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు నిర్మించాలని ప్రభుత్వం సంకల్పిస్తుంది." అని రేవంత్ అన్నారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. న్యూయార్క్, టోక్యో, సింగపూర్‌లతో హైదరాబాద్‌కు పోటీగా నిలబెట్టాలని తెలిపారు. కానీ, మూసీ ప్రక్షాళన.. ఫ్యూచర్ సిటీ కొందరికి నచ్చడం లేదని కామెంట్ చేశారు. ఎవరెన్ని చేసినా మూసీ ప్రక్షాళన చేసి తీరుతామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com