REVANTH: బనకచర్లపై సుప్రీంకోర్టుకు వెళ్తాం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి - బనకచర్ల ప్రాజెక్టు ప్రీ - ఫీజిబిలిటీ రిపోర్ట్‌ను తిరస్కరించాలని జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ గారిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. బనకచర్ల ప్రాజెక్టు గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్ -1980 (జీడబ్ల్యూడీటీ), ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం – 2014 లకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఫిర్యాదు చేశారు. జలవనరుల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం శుక్రవారం ఢిల్లీలో శ్రమశక్తి భవన్‌లో జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్, ఆ శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. బనకచర్లపై అభ్యంతరాలతో పాటు నీటి వాటాలకు సంబంధించి అనేక అంశాలను కేంద్ర మంత్రికి వివరించారు. బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర ఆర్థిక శాఖ, పర్యావరణ శాఖ వ్యవహరిస్తున్న తీరుతో తెలంగాణ ప్రజలు, రైతుల్లో ఆందోళన కలిగిస్తోందని కేంద్ర మంత్రికి తెలిపారు. గోదావరి వరద జలాల ఆధారంగా బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదిస్తున్నామని ఏపీ చెబుతోందని.. కానీ జీడబ్ల్యూడీటీ- 1980లో వరద జలాలు, మిగులు జలాల ప్రస్తావనే లేదని పేర్కొన్నారు. 2014 ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా నూతన ప్రాజెక్ట్ నిర్మించాలనుకుంటే.. ఆ నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జల సంఘం , జల్‌శక్తి మంత్రి అధ్యక్షతన రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండే ఎపెక్స్ కౌన్సిల్‌లో చర్చించి అనుమతి పొందాలని గుర్తు చేశారు.
సుప్రీంకోర్టుకు వెళ్తాం
జాతీయ ప్రాజెక్టు పోలవరం విషయంలో ఏపీ ప్రభుత్వం ఎటువంటి నిబంధనలు ఉల్లంఘించకుండా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. గోదావరిలో వరద జలాలున్నాయని నిజంగా ఏపీ భావిస్తే.. పోలవరం - బనకచర్లకు బదులు కేంద్రం నిధులు ఇచ్చి ఇచ్చంపల్లి - నాగార్జున సాగర్ అనుసంధానం ద్వారా పెన్నా బేసిన్‌కు నీళ్లు తీసుకెళ్లే విషయంలో చర్చకు తాము సిద్ధమన్నారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమని.. అన్ని వేదికల ద్వారా సమస్యలను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామన్నారు. కేంద్ర సానుకూలంగా స్పందించకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు. తెలంగాణకు గోదావరి నదిలో 1000 టీఎంసీలు, కృష్ణా నదిలో 500 టీఎంసీలు మొత్తంగా 1500 టీఎంసీల నీటి వినియోగానికి కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ, నిరభ్యంతర పత్రం జారీ చేసి, దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. 1500 టీఎంసీల నీటితో కోటిన్నర ఎకరాలకు నీరు అందుతుందని, ఏపీ చేపట్టే ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియను పరిశీలిస్తే అభ్యంతరం లేదని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com