REVANTH: మీ గుండెల్లో రాసుకోండి.. పదేళ్లు నేనే సీఎం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయడంలో తన నిబద్ధతను ప్రకటించారు. ఈ ప్రాజెక్టుతోపాటు దిండి, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ వంటి కీలక ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నాలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ రద్దు చేసుకోవాలని, అందుకు సహకరించాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. సహకారం లేకపోతే పోరాటం తప్పదని అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయడం తన బాధ్యత అంటూ స్పష్టం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం జటప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
‘పాలమూరు-రంగారెడ్డిని పూర్తి చేయలేదు. కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా ప్రాజెక్టులు చేయలేదు. లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం మూడేళ్లల్లో కూలేశ్వరం అయింది. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదన్నారు.. కానీ రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నాం.. వరికి బోనస్ ఇచ్చి ప్రతీ గింజ కొంటున్నాం.. మొదటి ఏడాదిలోనే రూ.21 వేల కోట్లతో రైతులకు రుణమాఫీ చేశాం.. 9 రోజుల్లో 9 వేలకోట్లు రైతుభరోసా ఇచ్చాం.. స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించి వారికి రుణాలు అందిస్తున్నాం. అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణ బాధ్యత వారికే అప్పగించాం.. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేసి ఆడబిడ్డల్ని వ్యాపారాల్లో ప్రోత్సహిస్తున్నాం.. సోలార్ ప్లాంట్ ఏర్పాటు, పెట్రోల్ బ్యాంకుల ఏర్పాటుకు ప్రోత్సహించి అంబానీ, అదానీతో పోటీ పడేలా ఆడబిడ్డలకు అప్పగించాం.. 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం.. ఇలా మొదటి ఏడాదిలోనే ఎన్నో పనులు చేశాం. కేసీఆర్ నీ గుండెలపై రాసి పెట్టుకో.. 2034 వరకు ఈ పాలమూరు బిడ్డే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాడు’ అని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబుకు విజ్ఞప్తి
ఏపీ సీఎం చంద్రబాబు రెండు రాష్ట్రాలను సమానంగా చూడాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేయాలన్నారు. తెలంగాణలో కృష్ణాపై చేపడుతున్న ప్రాజెక్టులకు అడ్డం పడవద్దని సహకరించాలని కోరారు. ప్రాజెక్టుకులకు సహకరించకపోతే పోరాటం చేస్తామన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును చంద్రబాబు అడ్డుకోవడం న్యాయం కాదన్నారు. కోయిల్ సాగర్ సహా ఇతర ప్రాజెక్టులను అడ్డుకోవద్దన్నారు. పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత తనదేనన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com