REVANTH: మీ ఓటే అభయ "హస్తమై".. వెలుగులు నింపుతోంది

గ్రామాన్ని అభివృద్ధి చేసేవారిని సర్పంచ్ ఎన్నికల్లో ఎన్నుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మంచోడికి అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తాడు.. ముంచేటోడికి అవకాశం ఇవ్వొద్దని కోరారు. కాళ్లల్లో కట్టెలు పెట్టే వాళ్ళు.. ఊరి అభివృద్ధిని ఎప్పటికీ జరుగనివ్వరు అని చెప్పారు. మీకు నిధులు ఇచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. రాబోయే పదేళ్లలో పాలమూరును పసిడి పంటల పాలమూరుగా అభివృద్ధి చేసుకుందామని కోరారు. నపర్తి జిల్లా ఆత్మకూరు, నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా ఆత్మకూరు, అమరచింత పురపాలక సంఘాల పరిధిలో రూ.151.92 కోట్ల అభివృద్ధి పనులు, రూ.121.92 కోట్లతో జూరాల ప్రాజెక్టు దిగువన హైలెవల్ వంతెన నిర్మాణానికి.. రూ.82.32 కోట్లతో మక్తల్-నారాయణపేట రోడ్డు, మక్తల్ పట్టణ పరిధిలో రూ.118.82 కోట్లతో చేపట్టనున్న పలు పనులకు శంకుస్థాపన చేశారు. మక్తల్లో నిర్వహించిన ప్రజాపాలన- ప్రజావిజయోత్సవ సభలో ప్రసంగించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మక్తల్ నియోజకవర్గాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేశారన్నారు. అందుకే మక్తల్ నుంచి ప్రజాపాలన విజయోత్సవాలు ప్రారంభించామని ఆయన తెలిపారు. పాలమూరు గడ్డ ప్రేమిస్తే ప్రాణమిస్తుందని, మోసగిస్తే పాతాళానికి తొక్కుతుందన్నారు సీఎం రేవంత్. గత పాలకులు ఈ ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలన్న ఆలోచన చేయలేదని ఆయన మండిపడ్డారు. ఈ జిల్లా ప్రాజెక్టులను గత ప్రభుత్వాధినేత పూర్తి చేయలేదని, సాగునీరు, తాగునీరు కోసం ఏనాడు గత పాలకులు తాపత్రయపడలేదని సీఎం రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. పాలమూరు గడ్డ ప్రేమిస్తే ప్రాణమిస్తుంది.. మోసగిస్తే పాతాళానికి తొక్కుతుందన్నారు.
ఎంత ఖర్చయినా సరే.. పూర్తిచేసే తీరుతా...
ఈ రెండేళ్ల విజయోత్సవ సభను మొదట మక్తల్లో నిర్వహించురకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంతో పాటు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోనూ ఉమ్మడి పాలమూరు జిల్లా నిర్లక్ష్యానికి గురైందని అన్నారు. పాలమూరు ప్రజలు అరిగోస పడుతున్నా.. ఏ నాయకుడు కూడా పట్టించుకోలేదు. అందుకే ఈసారి పాలమూరు జిల్లా ప్రజలు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించారని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తొలిరోజుల్లో ఈ జిల్లా నుంచి బూర్గుల రామకృష్ణారావు సీఎం అయ్యారు.. తర్వాత 75 ఏళ్లలో పాలమూరు జిల్లా నుంచి ఎవరూ సీఎం కాలేదు.. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత రాష్ట్ర సీఎంగా మీ బిడ్డకు అవకాశం వచ్చింది. ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు అన్నీ పూర్తిచేసే బాధ్యత తనదని అన్నారు. ఇప్పటికే నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. అందుకే ప్రజా పాలన వారోత్సవాలు ఇక్కడి నుంచి మొదలు పెట్టామని చెప్పారు. కొందరు కుట్రపూరితంగా నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టుపై కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారిన ఫైర్ అయ్యారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఏది ఆగదని స్పష్టం చేశారు. ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన ఏ రైతును కూడా అన్యాయం చేయబోమని.. ఎకరాకు రూ.20 లక్షల పరిహారం ఇచ్చేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. మాయగాళ్ల మాటలు విని ప్రాజెక్టులు, అభివృద్ధిని అడ్డుకోవద్దని రైతులను కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

