REVANTH: జడ్పీటీసీ టికెట్లు.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం

తెలంగాణలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఎలాగైన విజయం సాధించాలని అడుగులు కదుపుతోంది.అందులో భాగంగా జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక కోసం ప్రత్యేక దృష్టి పెట్టింది. జడ్పీటీసీలుగా పోటీ చేసేందుకు పెద్ద సంఖ్యలో ఆశావహులు ముందుకు వస్తున్న నేపథ్యంలో... ఒక్కో స్థానానికి ముగ్గురితో ప్రాథమికంగా ఒక జాబితాను సిద్ధం చేయాలని నిర్ణయించింది. జిల్లా ఇన్చార్జి మంత్రులు తయారు చేసే జాబితాను టీపీసీసీకి పంపనున్నారు. అలా వచ్చిన జాబితాలను పరిశీలించి జడ్పీటీసీ అభ్యర్థిని టీపీసీసీ ఫైనల్ చేయనుంది. స్థానిక ఎన్నికలు, మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతో రేవంత్ రెడ్డి చర్చించారు.
టికెట్లు వారికే..
టీపీసీసీకి వచ్చిన జాబితాలపై చర్చించిన తర్వాత టీపీసీసీనే అభ్యర్థిని నిర్ణయిస్తుందని రేవంత్ స్పష్టం చేశారు. జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికలో వారి గుణగణాలు, అభ్యర్థులకు ప్రజల్లో ఉన్న పరపతి, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. మంచి అభ్యర్థిని ఎంపిక చేస్తే ఎన్నిక సాఫీగా జరుగుతుందని అభిప్రాయపడ్డారు. అర్హులైన అభ్యర్థులనే పీసీసీ ఎంపిక చేస్తుందని, రాష్ట్రంలో ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని మంత్రులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. కాగా, ఎంపీటీసీ అభ్యర్థులను స్థానికంగా డీసీసీ స్థాయిలోనే ఎంపిక చేయాలని కాంగ్రెస్ నిర్ణయింది.
పొన్నం, టీపీసీసీ చీఫ్‌తో సీఎం రేవంత్ కీలక చర్చ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన కసరత్తును కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌తో పాటు జూబ్లీహిల్స్ ఎన్నిక షెడ్యూల్ కూడా వస్తుంది కాబట్టి.. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థి ఎంపికపై ఫోకస్ పెట్టింది. సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థులతో పాటు జూబ్లీహిల్స్ అభ్యర్థిపై చర్చ జరిగింది. ఈ నెల 6న ఏఐసీసీలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశంకు ముందే అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై రేవంత్ సమీక్షించారు. దీనిపై నివేదిక ఇవ్వాలని ముగ్గురు మంత్రులకు ఆయన సూచించారు. తాజారాజకీయ పరిస్థితులను వివరిస్తూ.. నివేదికలో అభ్యర్థుల పేర్లు, వివరాలు ఉండాలని పేర్కొన్నారు. గెలుపు గుర్రాన్ని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నిలబెట్టాలన్న కోణంలోనే నివేదిక ఉండాలని సీఎం పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికశాతం స్థానాలను కైవసం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఇన్ఛార్జ్ మంత్రులతోపాటు ఎంపీల భాగస్వామ్యంతో వెళ్లాలని సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com