TS: కీలక పదవుల్లో రేవంత్‌రెడ్డి సన్నిహితులు

TS: కీలక పదవుల్లో రేవంత్‌రెడ్డి సన్నిహితులు
సీఎం సలహాదారుగా వేం నరేందర్‌రెడ్డి... ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లురవి

అత్యంత సన్నిహితులైన నలుగురిని కీలక పదవుల్లో నియమించి.. క్యాబినెట్‌హోదా కల్పిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. సీఎం సలహాదారుగా వేం నరేందర్‌రెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లురవి, SC,ST, OBC , మైనార్టీ సంక్షేమ సలహదారుగా మాజీమంత్రి షబ్బీర్‌అలీ, ప్రోటోకాల్ ప్రజాసంబంధాల సలహదారుగా హార్కర్ వేణుగోపాల్‌రావుని నియమించారు. తెలంగాణ ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్దితో నిర్వర్తిస్తామన్న నలుగురు... తమమీద పెట్టిన నమ్మకాన్ని వమ్ముచేయమని స్పష్టంచేశారు. అత్యంత సన్నిహితులు, నమ్మకస్తులు.. కష్టకాలంలో అండగా నిలిచిన నలుగురు సీనియర్‌ నేతలు వేంనరేందర్‌ రెడ్డి, హర్కర్‌ వేణుగోపాల్‌, మల్లురవి, షబ్బీర్‌అలీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక పదవుల్లో నియమించారు.


ముఖ్యమంత్రి ప్రజావ్యవహారాల సలహాదారుగా నియమితులైన వేంనరేందర్‌రెడ్డి.. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి రేవంత్‌రెడ్డితో కలిసి పనిచేశారు. 16 ఏళ్లుగా వారిద్దరి స్నేహబంధం కొనసాగుతోంది. 2004నుంచి 2009 వరకు వేంనరేందర్‌రెడ్డి మహబూబాబాద్ MLAగా ఉండగా.. 2007లో రేవంత్‌రెడ్డి MLCగా ఎన్నికై చట్టసభల్లో అడుగుపెట్టి చురుకైన నాయకుడిగా వ్యవహరిస్తూ వచ్చారు. 2009లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో మహబూబాబాద్ రిజర్వుడ్ స్థానం కావడంతో వేంనరేందర్‌రెడ్డిని MLCగా గెలిపించేందుకు రేవంత్‌రెడ్డి తీవ్రంగా యత్నించారు. 2017లో వారిద్దరు కాంగ్రెస్‌లో చేరారు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడైన తర్వాత వేంనరేందర్‌రెడ్డిని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈ శాసనసభ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి వెంటనడిచిన ఆయన. పార్టీకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. తాజాగా ఆయనకు మంత్రిహోదా కల్పిస్తూ సలహాదారుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియమించుకున్నారు.


మరో సలహాదారు హర్కార్‌వేణుగోపాల్‌రావు ప్రోటోకాల్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు. 2018 ఎన్నికల్లో హార్కర్ వేణుగోపాల్ రావుకి టికెట్ ఇవ్వలేకపోయిన అధిష్టానం MLC పదవి ఇస్తామని హామీఇచ్చింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రోటోకాల్ ఛైర్మన్‌గా జాతీయ నాయకులు, ఇతర నాయకులు రాష్ట్రానికి వచ్చిన సమయంలో ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అందరిని సమన్వయం చేయడంలో కీలకంగా వ్యవహరించారు. ఆయనసేవలు గుర్తించి... ప్రోటోకాల్, ప్రజాసంబంధాల సలహాదారుగా CM నియమించారు. PCC ఉపాధ్యక్షుడుగా ఉన్న మల్లురవిని దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ప్రభుత్వం నియమించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌హయాంలో దిల్లీలో APప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా పనిచేసిన ఆయన.. పెండింగ్‌ప్రాజెక్టులకి అనుమతి తేవడం, కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు సకాలంలో వచ్చేలా చూడటంలో కీలకపాత్ర పోషించారు. అదే విషయాన్ని.. దృష్టిలో ఉంచుకొని.. దిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా...సీఎం నియమించారు. వైఎస్‌ హయాంలో మంత్రిగా పనిచేసిన... పార్టీ సీనియర్‌ నేత షబ్బీర్‌అలీని.. SC, ST, OBC, మైనార్టీ సంక్షేమ సలహదారుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియమించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీచేసి షబ్బీర్‌ అలీ ఓడిపోయారు. ఈతరుణంలో ఆయనకు కీలకపదవిని అధిష్టానం కట్టబెట్టింది.


Tags

Read MoreRead Less
Next Story