TS: జనగణనకు రోల్ మోడల్‌గా కుల గణన
కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో చేపట్టబోయే జనగణనకు తెలంగాణ సమగ్ర కులగణన రోల్ మోడల్ కావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ చేపట్టబోయే కులగణన ఎక్స్ రే మాత్రమే కాదు.. ఇది మెగా హెల్త్ చెకప్ లాంటిదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదాయాన్ని సామాజిక న్యాయం ప్రకారం ప్రజలకు పంచడమే కాంగ్రెస్ విధానమని స్పష్టం చేశారు. నవంబర్ 30లోగా కులగణన పూర్తి చేసి భవిష్యత్తు యుద్ధానికి సిద్ధం కావాలని, ఈ యుద్ధం ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించేలా ఉండాలని కాంగ్రెస్ నేతలకు ఆయన సూచించారు. తెలంగాణ చేపట్టే కులగణన మున్ముందు రాహుల్ గాంధీని ప్రధానిని చేసేలా ఉంటుందని అన్నారు.
నవంబర్ 6 నుంచి కుల గణన
నవంబర్ 6 నుంచి రాష్ట్రంలో కుల గణన ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 6న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఆహ్వానించాలని రాష్ట్ర నాయకత్వం యోచిస్తోంది. ఈ మేరకు గాంధీ భవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు.
టీచర్లతోనే కుల గణన సర్వే
రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వేపై రేవంత్ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. కుల గణన నవంబర్ 6 నుంచి తెలంగాణ వ్యాప్తంగా మొదలుకానుంది. ఈ సమగ్ర కుటుంబ సర్వే ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు అనే దానిపై కాంగ్రెస్ సర్కార్ స్పష్టతనిచ్చింది. స్కూలు టైమింగ్స్ పూర్తయ్యాక ఉపాధ్యాయులు రోజుకు 5 నుంచి 7 ఇళ్లల్లో సమగ్ర సర్వే చేయనున్నారు .
రాహుల్ మాట నిలబెట్టాలి
వచ్చే నెల 6 నుంచి ప్రారంభించనున్న కులగణనకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల నుంచి మద్దతు కోరుతూ బుధవారం పీసీసీ ఆధ్వర్యంలో గాంధీ భవన్‌లో సమావేశం నిర్వహించారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. పార్టీ నేతలను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడగానే సామాజిక, ఆర్థిక రాజకీయ కులగణన చేస్తామని గతంలో రాహుల్ గాంధీ మాట ఇచ్చారని, ఆ మాటను నిలబెట్టడం ప్రతి కాంగ్రెస్ నేత బాధ్యత అని ఆయన అన్నారు.
నిర్ణీత సమయంలోపూర్తి: మంత్రి జూపల్లి
కులగణనను నిర్ణీత సమయంలో పూర్తి చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ సామాజిక వర్గం ఎంతో నిష్పత్తి ప్రకారం వివరాలు సేకరిస్తామన్నారు. నవంబర్ 31 లోపు కులగణన చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలిపారు. కులగణన దామాషా ప్రకారమే రాజకీయ పదవులు ఉంటాయన్నారు. మూసి పరివాహక ప్రజలకు మేలు జరగడం BRS నేతలకు ఇష్టం లేదని ఆయన ఆరోపించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com