REVANTH: ‘ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను’.. @ 365

అవమానాలను.. ఆటుపోట్లను.. అవహేళనలను అధిగమిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నేటికి ఏడాది పూర్తయింది. కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు అందించి.. ఒంటి చేత్తో రేవంత్ రెడ్డి తెలంగాణలో పార్టీని అధికారంలోకి తెచ్చారు. పట్టుబట్టి బీఆర్ఎస్ ను ప్రతిపక్షానికే పరిమితం చేశారు. ఏడాది పాలనలోనూ తనదైన ముద్ర వేశారు. గత ఏడాది అనూహ్యంగా అధికారంలోకి వచ్చింది మొదలు రేవంత్ పెద్ద ఒడిదుడుకులు లేకుండానే పాలన సాగించారు. గ్రూపు కుమ్ములాటలకు పెట్టింది పేరైన కాంగ్రెస్ పార్టీలో ఏడాది కాలంలో అలాంటివి జరక్కుండా రేవంత్ ప్రభుత్వాన్ని నడిపారు. ముఖ్యమంత్రి పదవిని ఆశించిన సీనియర్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారు కూడా ప్రస్తుతానికి రేవంత్‌తో కలిసి నడుస్తున్నారు. సందర్భానుసారంగా రేవంత్ వారి మాటకు విలువిస్తూ కలుపుకుని పోతున్నట్లు కనిపిస్తోంది. గతంలో రేవంత్ పై విమర్శలు చేసిన కోమటిరెడ్డి సోదరులు ఇప్పుడు ఆయనకు అనుకూలంగా మాట్లాడుతుండడమే ఇందుకు నిదర్శనం. ప్రభుత్వ ప్రచార ప్రకటనలలో ఉప ముఖ్యమంత్రి భట్టి ఫోటోకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు.
నెట్టింట వైరల్
తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో రేవంత్ ప్రమాణస్వీకారం వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ నేతలు రీ ట్వీట్లు చేస్తున్నారు. రేవంత్ పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలను కూడా ప్రచారం చేస్తున్నారు.
రేవంత్ నిర్ణయాలకు హై కమాండ్ అండ
తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావడానికి పూర్తి సహకారాన్ని అందించిన కాంగ్రెస్ అధిష్ఠానం.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అడ్డంకులను అధిగమించడంలోనూ తోడ్పాటునిచ్చింది. రేవంత్ సర్కారు ఒక్కో అడుగు వ్యూహాత్మకంగా వేస్తున్నా.. హైడ్రా కూల్చివేతలు, మూసీ ప్రక్షాళన, లగచర్ల భూసేకరణలకు వ్యతిరేకత ఎదుర్కొంది. అయితే, ఈ అంశంలోనూ ప్రభుత్వానికి కాంగ్రెస్ అధిష్ఠానం.. రేవంత్ ప్రభుత్వానికి అండగా నిలిచింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com