REVANTH: తక్షణ సాయం చేయండి

తెలంగాణలో వరదల వల్ల భారీ నష్టం సంభవించిందని.. భేషరత్తుగా తక్షణ సాయం విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి... కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర బృందంతో భేటీ అయిన రేవంత్.. వరదల నివారణకు శాశ్వత నిధి ఏర్పాటు చేయాలని కోరారు. మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మిస్తే వరద సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. సమగ్ర అంచనాల ప్రకారం తెలంగాణలో రూ.10,032 కోట్ల నష్టం వాటిల్లిందని రేవంత్ అన్నారు.
భారీగా నష్టం
ఇప్పటి వరకు వివిధ శాఖల నుంచి అందిన సమగ్ర అంచనాల ప్రకారం రూ.10,032 కోట్ల నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రహదారులు పూర్తిగా దెబ్బతినగా.. దాదాపు దీని నష్టం రూ.2 వేల కోట్లకుపైగానే ఉంటుందని అధికారులు తెలిపారు. వంతెనల ధ్వంసంతో మరో రూ.700 కోట్ల నష్టం జరిగిందని పేర్కొన్నారు. పంచాయతీ రోడ్లు, మిషన్ భగీరథ పైపులైన్ల పునరుద్ధరణకు దాదాపు రూ.200 కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వరదల కారణంగా ట్రాన్స్‌కోకు భారీ నష్టం వాటిల్లిందని రేవంత్ అన్నారు. అటు, విద్యుత్ స్తంభాలు, సబ్ స్టేషన్ల రిపేర్ల కోసం దాదాపు రూ.150 కోట్లకు పైగానే నిధులు అవసరం అవుతాయన్నారు.
మరోవైపు వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు.. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ సలహాదారు కల్నల్ కేపీ సింగ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం ఖమ్మం జిల్లాలో పర్యటించింది. ఖమ్మం నగరంతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండు బృందాలుగా వీడి సభ్యులు పర్యటించి నష్టం అంచనా వేశారు. ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి, కాల్వొడ్డు, బొక్కలగడ్డ, ప్రకాష్ నగర్, మోతీ నగర్‌లోని రాజీవ్ గృహకల్పలో ఓ బృందం పర్యటించింది. అటు, రెండో బృందం నగరంలోని దానవాయిగూడెం, తల్లంపాడు - తెల్దారుపల్లి, ఖమ్మం రూరల్ మండలంలోని తనగంపాడు, ప్రకాష్ నగర్‌లో పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేసింది. వరద కారణంగా కోతకు గురైన పొలాలు, ఇసుక మేటలు వేసిన పొలాలను కేంద్ర బృందం పరిశీలించింది. వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com