TS: తెలంగాణలో కుల గణన

TS: తెలంగాణలో కుల గణన
కల్యాణమస్తులో లక్ష రూపాయలతో పాటు తులం బంగారం... ప్రణాళికలు రూపొందించాలని రేవంత్‌రెడ్డి ఆదేశం
తెలంగాణలో కులగణన చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కల్యాణమస్తు పథకంలో లక్ష రూపాయలతోపాటు తులం బంగారం ఇచ్చేందుకు అసరమైన బడ్జెట్ ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాలు ఒకే చోట ఉండేలా అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక సమీకృత హబ్ నిర్మించాలని నిర్ణయించారు. ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకంలో ఎక్కువ మంది విద్యార్థులకు లబ్ధిచెందేలా ప్రతిపాదనలు తయారు చేయాలని సీఎం సూచించారు. ఎన్నికల హామీల అమలులో భాగంగా తెలంగాణలో త్వరలో కుల గణన చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇందుకోసం అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు.సచివాలయంలో బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. కులగణనపై అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో తీర్మానం చేయాలని రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. తద్వారా చట్టబద్ధత తీసుకురావాలని భావిస్తున్నారు. బీసీ కమిషన్‌ పునర్‌ వ్యవస్థీకరణపైనా సమావేశంలో చర్చించారు. ఛైర్మన్‌, సభ్యుల నియామకం, అర్హతలు వంటి విషయాలను అధికారులను రేవంత్‌రెడ్డి అడిగి తెలుసుకున్నారు. త్వరలో నివేదిక ఇవ్వాలని బీసీ సంక్షేమ శాఖను ఆదేశించారు.


ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలను వేర్వేరు ప్రాంతాల్లో కాకుండా... ఒకే చోట ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. అన్ని గురుకులాలు ఒకే చోట ఉండేలా అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇలా చేయడం వల్ల గురుకులాల నిర్వహణ, పర్యవేక్షణ, అజమాయిషీ మరింత మెరుగవుతుందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఎక్కువ మంది విద్యార్థులు ఒకే ప్రాంగణంలో చదువడం వల్ల.. వారిలో ప్రతిభ పాటవాలు, పోటీ తత్వం పెరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఎడ్యుకేషన్ హబ్‌ల నిర్మాణానికి అవసరమైన స్థలాలను వెంటనే గుర్తించాలని... నియోజకవర్గ కేంద్రంలో వీలు కాకపోతే.. అదే సెగ్మెంటులోని మరో పట్టణం లేదా మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటికే 20 ఎకరాలకు పైగా విస్తీర్ణమున్న గురుకులాల్లో మిగతా భవనాలను నిర్మించి హబ్‌గా తీర్చిదిద్దాలన్నారు. ఎడ్యుకేషన్ హబ్‌ల నిర్మాణానికి కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. సీఎస్ఆర్ నిధులను సమీకరించడంతోపాటు.. దాతల నుంచి విరాళాలు స్వీకరించాలని తెలిపారు.


కళ్యాణమస్తు, షాదీ ముబారక్ లబ్ధిదారులకు లక్ష రూపాయలతోపాటు తులం బంగారం అందించేందుకు అవసరమైన బడ్జెట్ ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రతీ పార్లమెంటు నియోజకవర్గానికి ఒక బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసేలా అధ్యయనం చేయాలన్నారు. మహాత్మ జ్యోతిభాపూలే ఓవర్ సీస్ స్కాలర్ షిప్ స్కీమ్‌ను మరింత సమర్ధంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ఎక్కువ మంది అర్హులకు మేలు జరిగేలా చూడాలని సీఎం తెలిపారు. ర్యాంకింగ్‌ల ఆధారంగా టాప్ విదేశీ యూనివర్సిటీలకు వెళ్లే విద్యార్థులకు మొదటి ప్రాధాన్యమివ్వాలని సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story