రూ.80 లక్షల ఖర్చు.. అయినా కుటుంబంలోని ముగ్గురు మృత్యుఒడిలోకి..
కుటుంబసభ్యుల మధ్యనే పార్టీ. బయట నుంచి ఎవరినీ పిలవట్లేదు. ఇక కరోనా వచ్చే అవకాశమే లేదనుకున్నారు. ఏప్రిల్ 28న.. 25వ సంవత్సర వివాహ వార్షికోత్సవ వేడుకలను ఆనందంగా జరుపుకున్నాడు సుభాష్.
వేడుక ముగిసిన రెండు రోజులకే కుటుంబంలోని ముగ్గురు కరోనా బారిన పడ్డారు. నెల రోజుల వ్యవధిలో ముగ్గురు కరోనా కాటుకు బలయ్యారు. శంషాబాద్ మున్సిపల్ పరిధిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. తొండుపల్లికి చెందిన పెదిరిపాటి విఠలయ్య-సులోచన దంపతులకు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె. ఏప్రిల్ 28న చిన్న కుమారుడు సుభాష్ తన 25వ వివాహ వార్షికోత్సవ వేడుకలను కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి జరుపుకున్నారు.
ఈ క్రమంలో కుటుంబంలోని ఐదుగురు కరోనా బారిన పడ్డారు. మే1 సులోచన కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆమె మే12న మరణించింది. కుమారుడు సుభాష్(50), కుమార్తె (45) లావణ్యలను కూడా ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది కరోనా లక్షణాలు తీవ్రం కావడంతో. 25 రోజుల అనంతరం సుభాష్ ఈనెల 8న తుది శ్వాస విడవగా, దాదాపు 31 రోజులు మృత్యువుతో పోరాడిన లావణ్య సోమవారం కన్నుమూసింది.
కుమారుడి దశదిన కర్మ రోజే కుమార్తె అంత్యక్రియలు చేయడం స్థానికుల్ని కలచి వేసింది. లావణ్య భర్త కిరణ్ గౌడ్ పదేళ్ల క్రితమే మరణించారు. అప్పటి నుంచి ఆమె అమ్మగారింట్లోనే ఉంటోంది. సుభాష్ భార్య చంద్రికకు, కుమారుడికీ కరోనా వచ్చినా వారిద్దరూ ఇంటి వద్దనే కోలుకున్నారు. కరోనా బారిన పడిన భార్య, కుమారుడు, కుమార్తెను బతికించుకోవడానికి విఠలయ్య నెల రోజుల పాటు కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ.80 లక్షలకు పైగా ఖర్చు పెట్టారు. అయినా ముగ్గురూ మృత్యువాత పడ్డారని ఆయన కన్నీరు మున్నీరవుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com