Ramagundam: నిలిచిపోయిన రూపాయికే అంత్యక్రియలు పథకం "ఆఖిరిసఫర్"

రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో రూపాయికే అంతిమసంస్కారాలు నిర్వహించే ఆఖిరి సఫర్ నిలిచిపోయింది. దీంతో మనిషి మరణించిన తదనంతర మజిలీని సైతం కొంతమంది దందాగా మలుచుకున్నారు. అంత్యక్రియలకు ప్యాకేజీలతో ముక్కు పిండి డబ్బులు వసూళ్లు చేస్తున్నారు.
ఆత్మీయులు చనిపోతే అంత్యక్రియలు కూడా చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్న పేదవారికి అండగా ఉండేందుకు రామగుండం కార్పొరేషన్ 'ఆఖిరిసఫర్' అనే పథకాన్ని చేపట్టింది. రూపాయికే అంతిమ సంస్కారాలు నిర్వహించే ఈ కార్యక్రమం కొన్ని నెలలపాటు సజావుగానే అమలైంది. కానీ ఐదు నెలలుగా కార్పొరేషన్ నుంచి నిధులు విడుదల కాక నిలిచిపోయింది. మృతదేహాన్ని కర్రలతో ఖననం చేస్తే 3వేల 500, గొయ్యి తవ్వితే 2వేల 500 రూపాయల్ని కార్పొరేషన్ భరించేది. స్మశాన వాటికకు వెళ్లేందుకు ఉచితంగా వైకుంఠ రథాన్ని కూడా ఏర్పాటుచేసేవారు. ప్రస్తుతం ఈ నిధులు భరించలేమని నగరపాలక సంస్థ చేతులేత్తేయడంతో నిరుపేదలకు కష్టాలు తప్పడం లేదు. రామగుండం నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యంతో వైకుంఠధామం అధ్వానంగా తయారైందని ప్రజలు మండిపడుతున్నారు. గొంతు తడుపుకునేందుకు కనీసం మంచి నీటి సౌకర్యం కూడా ఏర్పాటుచేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైకుంఠధామంలో ప్రజలు ఎదుర్కొంటున్నఇబ్బందులపై ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం దృష్టిసారించాలని స్థానికులు కోరుతున్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com