RSS meet: హైదరాబాద్ వేదికగా ఆర్ఎస్ఎస్ కీలక సమావేశాలు.. మూడు రోజుల పాటు..

RSS (tv5news.in)
RSS meet: ఆర్ఎస్ఎస్ కీలక సమావేశాలకు హైదరాబాద్ వేదిక కాబోతోంది. జనవరి 5 నుండి 7 వరకు మూడు రోజుల పాటు ఆర్ఎస్ఎస్ కార్యకారిణీ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశాలకు ఆర్ఎస్ఎస్ సర్ సంచాలక్ మోహన్ జీ భగవత్ ముఖ్య అథిదిగా హాజరు కాబోతున్నారు. ఈ సమావేశంలో దేశంలో జరుగుతున్న అనేక సంఘటలనపై కీలక చర్చ జరనున్నట్టు తెలుస్తోంది.
యాభైకి పైగా ఉన్న ఆర్ఎస్ఎస్ అనుభంద విభాగలకు చెందిన జాతీయ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు హాజరుకానున్నట్టు సమాచారం. ఇదే సమావేశాలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోష్ జీ, వీహెచ్పీ, ఏబీవీపీ, బీఎంఎస్ వంటి సంస్థలకు చెందిన అగ్రనేతలు హాజరుకానున్నారు . 2019 ఫిభ్రవరి 21, 22, 23 తేదీలలో బెంగళూరులలో జరగాల్సిన ఈ సమావేశాలను కరోనా కారణంగా వాయిదా వేసినట్టు సంఘ్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రతి రెండేళ్లకోసారి దేశంలోని వివిధ నగరాల్లో నిర్వహించే ఈ సమావేశాలను ఈసారి హైదరాబాద్‌ను వేదిక చేసుకుంది ఆర్ఎస్ఎస్. ఈ సమావేశాలను మూడురోజుల పాటు నగరంలో నిర్వహించనుంది స్వయం సేవక్ సంఘ్. ఇందుకు సంభందించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసారు సంగ్ ప్రతినిధులు. దేశ వ్యాప్తంగా అనుభంద విభాగాలు నిర్వహిస్తున్న కార్యక్రమాలు, జరుగుతున్న పరిణామాలపై పూర్తి సమాచారం సేకరించనున్నారు ఆర్ఎస్ఎస్ అగ్రనేతలు.
అనుభంద విభాగాల ముఖ్య నాయకులు ఇచ్చిన సమాచారం మేరకు ఎలాంటి కార్యాచరణ సిద్దం చేయాలన్న దానిపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ జీ భగవత్ రెండు రోజుల పాటు హైదరాబాద్‌కు వచ్చి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే ఈ సమావేశాల సందర్భంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు..? ఏ విధమైన పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయన్నది చర్చనీయాంశంగా మారింది.
ఆర్ఎస్ఎస్ అనుభంద సంఘాలు కరోనా సమయంలో చేసిన సేవా కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. అసవరాన్ని బట్టి ఆర్ఎస్ఎస్ దాని అనుభంద విభాగాలకు సంబంధించిన కీలక నేతలకు పదోన్నతులతో పాటు బదిలీలు కూడా భారీగా జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ సమావేశాలకు హైదరాబాద్ వేదిక కానుండటంతో తెలంగాణలో ఆర్ఎస్ఎస్ అనుభంద విభాగం అయిన బీజేపీలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో అన్న చర్చ సాగుతోంది.
ఇప్పటికే బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపై దృష్టి సారిచడంతో రాష్ట్ర నాయకులకు ఎలాంటి ఆదేశాలు అందుతాయన్నది వేచి చూడాలి. సమావేశాలు ముగిస్తే కాని ఎలాంటి ఆదేశాలు వస్తాయన్నది తేలే అవకాశం లేదంటున్నాయి పార్టీ వర్గాలు. గతంలో యూపీలో ఇలాంటి సమావేశాలు నిర్వహించిన తరువాత బీజేపీ అక్కడ అధికారంలోకి వచ్చిందని.. ఈ సారి హైదరాబాద్ దీనికి వేదిక కావడంతో ఆలాంటి వ్యూహరచనతోనే ఇక్కడ కార్యాకరిణీ సమావేశాల ఉద్దేశ్యమా అన్నది చర్చనీయాంశంగా మారింది.
అదే నిజమైతే తెలంగాణలో ఆర్ఎస్ఎస్ అనుభంద విభాగాలు మరింత యాక్టీవ్‌గా పనిచేసే అవకాశం ఉంది. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకు అవసరం అయితే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలతో పాటు పార్టీ కీలక నేతలతో కూడా ఈ సమావేశానికి ఆహ్వానించి చర్చించే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేమంటున్నారు పార్టీలో నేతలు.
ఈ సమావేశాలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా వచ్చే అవకాశం ఉందని.. చర్చలో భాగంగా అవసరం అయితే ప్రధాని మోదీని కూడా ఆహ్వానించే అవకాశం ఉందంటున్నారు. వీరందరినీ సమావేశానికి ఆహ్వానిస్తే మాత్రం ఇక తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు తథ్యం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
బీజేపీ మరింత దూకుడుగా ఎలా ప్రజల్లోకి వెళ్లాలి..? ప్రజలను బీజేపీ వైపు తిప్పేలా ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలన్న దానిపై కీలక ఆదేశాలు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయన్న చర్చ పార్టీలో ఉంది. ఆర్ఎస్ఎస్ సమావేశాలు హైదరాబాద్‌ను భాగ్యనగరంగా మార్చే కుట్రలో భాగమే అంటూ ఇప్పటికే చర్చ మొదలైన నేపథ్యంలో.. ఈ సమావేశాల్లో ఎలాంటి చర్చలు జరుగుతాయి..? నిజంగా తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ఈ సమావేశంలో చర్చలు సాగుతాయా అన్నది వేచి చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com