Rythu Bandhu: రైతుల ఖాతాల్లో రైతు బంధు.. ఎప్పటినుండి అంటే..?

Rythu Bandhu: రైతుల ఖాతాల్లో రైతు బంధు.. ఎప్పటినుండి అంటే..?
Rythu Bandhu: వానాకాలం పెట్టుబడి సాయాన్ని ఈ నెల 28 నుంచి రైతుల ఖాతాలల్లో జమ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

Rythu Bandhu: రైతులకు గుడ్‌ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. వానాకాలం పెట్టుబడి సాయాన్ని ఈ నెల 28 నుంచి రైతుల ఖాతాలల్లో జమ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ను ఆదేశించారు. ఎప్పటిలాగానే వరుస క్రమంలో రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు ప్రభుత్వం జమ చేయనుంది.

తక్కువ విస్తీర్ణం ఉన్నవారితో ప్రారంభించి రైతులకు పెట్టుబడి సాయాన్ని ఖాతాల్లో జమ చేయనున్నారు. వానాకాలం సీజన్‌కు రైతు బంధు కింద 7 వేల 600 కోట్ల రూపాయలు సాయం అందే అవకాశం ఉంది. ఈ నెల 28 నుంచి 9వ విడుత పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

కేంద్ర ప్రభుత్వం ఆర్థిక నిబంధనల పేరిట కొర్రిలు పెట్టి ఇరికించాలని చూసినా కూడా రైతుబంధు పథకం ఆగదన్నారు. ముఖ్యమంత్రికి రైతులు,వ్యవసాయం పట్ల ఉన్న మక్కువకు ఇది నిదర్శనమన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతిష్టాత్మకంగా రైతుబంధు అమలు చేస్తున్నామన్నారు. ఈ నెల 28 నుంచి రైతు బంధు నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో అర్హులైన రైతుల వివరాలు పంపాలని సీసీఎల్‌ఏను వ్యవసాయ శాఖ కోరింది.

గతేడాది వానాకాలంలో 60 లక్షల 84 వేల మంది రైతులకు 7 వేల 360 కోట్ల రూపాయలు రైతు బంధు కింద సాయం అందించారు. యాసంగిలో 63 లక్షల మంది రైతుల 7 వేల 412 కోట్ల రూపాయల రైతు బంధు అందించారు. 2022-23 బడ్జెట్‌లో రైతుబంధు కోసం 14 వేల 800 కోట్లు రూపాయలు కేటాయించారు. ఇప్పటివరకూ మొత్తం 8 విడతల్లో రైతు బంధు సాయం కింద 50 వేల 447 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసింది ప్రభుత్వం.

Tags

Read MoreRead Less
Next Story