రైతుల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ మరో ముందడుగు..

రైతుల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ మరో ముందడుగు..

రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు, వ్యవసాయ పద్దతులను తీసుకొచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్‌... ఇప్పుడు మరో ముందడుగు వేశారు. రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రైతులందరినీ ఒకే వేదికపైకి తెచ్చి... వారికి అన్ని సేవలు అందుబాటులో ఉండేవిధంగా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. శనివారం జనగామ జిల్లాలో పర్యటించనున్న సీఎం కేసీఆర్‌.. కొడకండ్ల గ్రామంలో నిర్మించిన రైతు వేదికను ప్రారంభించనున్నారు.

రైతులు, వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతు బంధు సమితి సభ్యులు సమావేశమయ్యేలా ఈ రైతు వేదికలను ప్రభుత్వం నిర్మిస్తుంది. దీనిలో భాగంగా జనగామ జిల్లాలో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని కేసీఆర్... శనివారం మధ్యాహ్నం ప్రారంభిస్తారు. బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో జనగామ జిల్లా కొడకండ్లకు చేరుకుని.. మధ్యాహ్నం 12 గంటలకు రైతు వేదికను ప్రారంభించి... రైతులతో కలిసి సమావేశమవుతారు. అలాగే అక్కడున్న పల్లె ప్రకృతి వనాన్ని సీఎం పరిశీలిస్తారు. అనంతరం కొడకండ్ల మండలంలోని రామవరం గ్రామంలో వైకుంఠదామం, డంపింగ్ యాడ్ పనులను పరిశీలిస్తారు.

దేశానికే అన్నంపెట్టే రాష్ట్రంగా అన్నదాతలను చైతన్యపరిచేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వేదికలను ఏర్పాటుచేస్తోంది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని 2 వేల 604 క్లస్టర్లలో 573 కోట్ల వ్యయంతో రైతు వేదికలను నిర్మిస్తోంది. ప్రతి 5 వేల ఎకరాలను ఒక క్లస్టర్‌గా విభజించి, ప్రతిక్లస్టర్‌కు ఒక రైతు వేదికలను ఏర్పాటు చేస్తారు. ఒక్కో వేదికను 22 లక్షల ఖర్చుతో నిర్మిస్తున్నారు. రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వీటి నిర్మాణాలు చేపడుతున్నారు. రైతులు సమావేశమయ్యేందుకు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు అవగాహన సదస్సులు నిర్వహించేందుకు ఈ రైతు వేదికలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

రాష్ట్రంలో దాదాపు 61 లక్షల మంది రైతులుండగా.. కోటిన్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. తెలంగాణలో సగానికి పైగా ప్రజలు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. రైతులను సంఘటిత పరిచేందుకు సీఎం కేసీఆర్... 2017 సెప్టెంబర్ 15న రైతుబంధు సమితులకు రూపకల్పన చేశారు. రాష్ట్రంలో 10 వేల 733 గ్రామాల్లో రైతుబంధు సమితులు ఏర్పడ్డాయి. గ్రామస్థాయిలో 15 మంది రైతులతో, మండలస్థాయిలో 24 మందితో, జిల్లాస్థాయిలో 24 మందితో, రాష్ట్రస్థాయిలో 42 మంది సభ్యులతో మొత్తం ఒక లక్షా 61 వేల మంది రైతులు సభ్యులుగా రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేశారు. రైతు సమన్వయ సమితి సభ్యులు, శాస్త్రవేత్తలు సమావేశమయ్యేందుకు ఈ వేదికలు ఉపయోగపడనున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story