SAD: సౌదీ ప్రమాదంలో ఒకే కుటుంబంలో 18 మంది మృతి

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌లోని విద్యానగర్‌కు చెందిన నజీరుద్దీన్ కుటుంబంలోని 18 మంది మృతి చెందారు. నజీరుద్దీన్ ఓ విశ్రాంత రైల్వే ఉద్యోగి. తన కుటుంబ సభ్యులతో కలిసి మక్కా యాత్రకు వెళ్లారు. అంతలోనే ఈ ఘోర ప్రమాదం వారి కుటుంబాన్ని కబళించింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన మొత్తం 45 మంది సజీవ దహనమయ్యారు. మృతి చెందిన వారిలో 17 మంది పురుషులు, 18 మంది మహిళలు, 10 మంది చిన్నారులు ఉన్నట్లు పేర్కొంది.
సౌదీకి ప్రభుత్వ కమిటీ
సౌదీలో ఘోర ప్రమాదంలో 45 మంది హైదరాబాదీలు సజీవ దహనం కావడంపై తెలంగాణ మంత్రివర్గం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యే, ఒక మైనార్టీ అధికారితో ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వెంటనే సౌదీ వెళ్లి అక్కడి అధికారులతో సంప్రదింపులు జరపాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఇప్పటికే అక్కడికి ఎవరెవరు వెళ్లారు.. ఎలా వెళ్లారనే దానిపై ఓ స్పష్టతకు వచ్చినట్లు మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్ వెల్లడించారు.
అక్కడే దహన సంస్కారాలు
బాధిత కుటుంబీకుల ఒక్కొక్కరి ఇంటి నుంచి ఇద్దరిని తీసుకెళ్లనున్నారు. చనిపోయిన వారికి సంప్రదాయం ప్రకారం అక్కడే దహన సంస్కారాలు చేయనున్నారు. మొత్తం నాలుగు ట్రావెల్ ఏజెన్సీల ద్వారా ఈనెల 9న హైదరాబాద్ నుంచి వీరంతా ఉమ్రాకు బయల్దేరారు. విజయవంతంగా మక్కా యాత్ర పూర్తిచేసుకుని మదీనాకు వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మదీనాకు 25 కి.మీ దూరంలో బస్సు-డీజిల్ ట్యాంకర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మొత్తం 45 మంది సజీవ దహనమయ్యారు. దీనిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
బతికి బయటపడింది ఒక్కడే
సౌదీలో జరిగిన బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు చనిపోవడం కన్నీళ్లు తెప్పిస్తోంది. దైవ దర్శనానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిన మృతుల కుటుంబాల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు చనిపోగా.. బతికి బయటపడ్డ యువకుని పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ప్రమాదంలో ఎనిమిది మందిలో ప్రాణాలతో బయటపడ్డాడు షోయబ్ అనే యువకుడు. తీవ్రంగా గాయపడిన షోయబ్ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. మిగిలిన ఏడుగురు చనిపోయినట్లుగా గుర్తించారు. మహమ్మద్ అబ్దుల్ కధీర్ (షోయబ్ తండ్రి, గౌసియా బేగం (షోయబ్ తల్లి) తోపాటు బంధువులు మహమ్మద్ మౌలానా (గౌసియా తండ్రి, షోయబ్ తాత), రహీమ్ ఉనిషా, రెహమత్ బి, మహమ్మద్ మన్సూర్ చనిపోయారు. వీరితో పాటు మరొకరు ఉన్నట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

