SAD: ప్రజా కవి అందెశ్రీ కన్నుమూత

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూశారు. ఇవాళ ఉదయం ఇంట్లో ఉండగా ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆయనను చికిత్స నిమిత్తం హుటాహుటి గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.
సీఎం, మాజీ సీఎం దిగ్భ్రాంతి
రచయిత అందెశ్రీ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అందెశ్రీతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరనిలోటని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. స్వరాష్ట్ర సాధన కోసం జాతిని జాగృతం చేయడంలో ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిస్తుందన్నారు. కొట్లాది ప్రజలు గొంతుకై నిలిచారని పేర్కొన్నారు.
'మాయమైపోయాడమ్మ.. మన అందెశ్రీ '
సామాజిక పరిస్థితులనే పాఠాలుగా నేర్చి.. పాటలుగా మలిచారు అందెశ్రీ. 'మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడు' లాంటి సహజసిద్ధ పాటలతో మనుషుల్ని, మనసుల్ని మేల్కొలిపారు. ఎర్ర సముద్రం సినిమా కోసం రచించిన మాయమైపోతుండమ్మా మనిషన్నవాడు ఆంధ్రప్రదేశ్‌లోని పలు విశ్వవిద్యాలయాలు ఎంఏ తెలుగులో రెండో సంవత్సరం సిలబస్‌లో చేర్చడం విశేషం. అందెశ్రీ రచించిన జయజయహే తెలంగాణ గీతం.. తెలంగాణ జాతి గీతంగా, ప్రార్థనాగీతంగా పాడుకుంటున్నారు.
చదువుకోలేదు.. సాహితీ లోకాన్ని ఏలేశాడు
అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. వరంగల్ జిల్లా రేబర్తిలో 1961 జూలై 18న జన్మించారు. ఒక అనాథగా పెరిగారు. ఏ విధమైన చదువు చదవలేదు. గొడ్ల కాపరిగా పనిచేశారు. శృంగేరి మఠానికి చెందిన స్వామీ శంకర్ మహారాజ్ ఇతను పాడుతుండగా విని ఇతడిని చేరదీశాడు. అలా ఈయన పాటలు ప్రజల్లోకి వచ్చాయి. అశువు కవిత్వం చెప్పటంలో ఈయన దిట్ట. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రచించారు. కాకతీయ వర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

