Telangana: ఇక జనవరి మొత్తం పిల్లలకు సంక్రాంతి సెలవులే..!

Telangana: తెలంగాణలోని విద్యా సంస్థలకు ఈనెల 30 వరకు సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతుండడంతో స్కూళ్లు, కాలేజీలకు హాలిడేస్‌ను ఎక్స్‌టెండ్ చేసింది. సంక్రాంతి సందర్భంగా ఈసారి 8వ తేదీ నుంచే సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ్టితో సెలవులు ముగుస్తుండడంతో తాజా నిర్ణయం తీసుకుంది.
వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగానే విద్యా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా డెల్టా వేరియంట్‌తో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతుండడంతో సర్కార్ ఈ నిర్ణయానికి వచ్చింది. తెలంగాణలో అన్ని రకాల విద్యా సంస్థలకు ఈ సెలవులు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై ప్రగతి భవన్‌లో మంత్రివర్గ సమావేశం జరగనుంది.
రేపు మధ్యాహ్నం రెండు గంటలకు కేసీఆర్ అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ జరగబోతోంది. రాష్ట్రంలోనూ కరోనా కేసులు భారీగా నమోదవుతుండడంతో.. ఈ అంశంపైనే ప్రధానంగా చర్చిస్తారని తెలుస్తోంది. పలు రాష్ట్రాలు కర్ఫ్యూ, వివిధ ఆంక్షలు పెడుతుండడంతో.. రేపటి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు అంశం కూడా చర్చకు రానుంది.
తెలంగాణలో ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తైనప్పటికీ.. అదంతా 18 ఏళ్ల పైబడిన వారికి మాత్రమే జరిగింది. ఈ మధ్యే 15 నుంచి 18 ఏళ్ల లోపు టీనేజర్లకు టీకాలు ఇవ్వడం మొదలుపెట్టారు. 15 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సినే రెడీ కాలేదు. దీంతో స్కూళ్లు, కాలేజీలు ఓపెన్ చేస్తే.. వారి ద్వారా ఇంట్లోని పెద్దవాళ్లకు కరోనా సోకవచ్చని ప్రభుత్వం అభిప్రాయపడింది.
మరోవైపు థర్డ్‌వేవ్‌లో పిల్లలపై మహమ్మారి ప్రభావం చూపుతోంది. అమెరికాలో ఎప్పుడూ లేనంతగా పిల్లలకే ఎక్కవగా కరోనా సోకుతోంది. ఇటు దేశంలోని పలు రాష్ట్రాలు సైతం విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చాయి. ఈనెలాఖరు నాటికి కరోనా కేసులు గరిష్టస్థాయికి చేరొచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముందు జాగ్రత్తగా తెలంగాణ ప్రభుత్వం సెలవులను ఈనెల 30వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com