SC: ఎస్సీ వర్గీకరణకు ఆమోదం

తెలంగాణలో ఎస్సీలను మూడు గ్రూపులుగా వర్గీకరించిన ప్రభుత్వం.. ఆ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించింది. ఇందుకు సంబంధించి మంత్రి దామోదర రాజనర్సింహ ప్రవేశపెట్టిన ‘తెలంగాణ షెడ్యూల్డ్ కులాలు (రిజర్వేషన్ల హేతుబద్దీకరణ) బిల్లు-2025’ను అసెంబ్లీ ఉభయసభలు ఆమోదించాయి. దీనిపై శాసనసభ, శాసనమండలిలో చర్చించిన అనంతరం సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి దామోదర రాజనర్సింహ ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ వేదికగా ఎస్సీ వర్గీకరణ బిల్లుపై మంత్రి దామోదర ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘ఈరోజు తెలంగాణ చరిత్రలోనే నిలిచిపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు. కుల వివక్ష దేశాన్ని బలహీనపరుస్తోందని గాంధీ చెప్పారు. కులవివక్ష కారణంగా దళితులు వివక్షకు గురయ్యారు. వివక్ష కారణంగానే ఎన్నో ఉద్యమాలు జరిగాయి’ అని వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ ఆద్వర్యంలోని ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను ప్రకటిస్తున్నందుకు గర్వంగా భావిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో తెలిపారు. తెలంగాణ పోరాటంలా.. ఎస్సీ వర్గీకరణ పోరాటం సైతం 30 ఏళ్లుగా సంక్లిష్టంగా మారుతూ వచ్చిందని, అనేక ఆటుపోట్లు, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొందని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ సమస్యకు సభ పరిష్కారం చూపడం చరిత్రాత్మకమైన సందర్భమని, ఇది వ్యక్తిగతంగా తన మనసుకు దగ్గరగా ఉన్న అంశమని రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సోనియాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించినట్టుగా.. నేడు ఎస్సీ వర్గీకరణను ప్రకటించామన్నారు.
వర్గీకరణపై ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ ఎల్లప్పుడు వర్గీకరణకు కట్టుబడి ఉందంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ అసెంబ్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్నికల ప్రచారంలోనూ ఈ అంశంపై రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. పగడ్భందీ ప్రణాళికతో ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకొచ్చారు. పంజాబ్, హర్యానా, తమిళనాడులో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతోంది. షమీమ్ అక్తర్ కమిటీ దీనిపై అధ్యయనం చేసింది’ అని ఉత్తమ్ వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com