SC: గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులు రద్దు

తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్, అమీర్ అలీఖాన్ నియామకాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. వారి నియామకాలను నిలిపివేస్తూ తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్ నియామకాలను భారత రాష్ట్ర సమితి నేత దాసోజు శ్రవణ్, సత్యనారాయణ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు.. నేడు తీర్పు వెలువరించింది. తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపిక ఉండాలని పేర్కొంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం సవరించింది. మధ్యంతర ఉత్తర్వుల తర్వాత ప్రమాణస్వీకారం చేయడం తప్పు అని సుప్రీంకోర్టు పేర్కొంది.
కోదండరామ్, అలీఖాన్ ఎమ్మెల్సీల పదవులను రద్దు చేసింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు ధర్మాసనం సవరించింది. గవర్నర్ అధికారాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కళలు, సాహిత్యం, విజ్ఞానశాస్త్రం, సామాజిక సేవకే గవర్నర్ కోటా అని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సెప్టెంబర్ 17కి తదుపరి విచారణను వాయిదా వేసింది. గవర్నర్ కోటా నామినేషన్లలో రాజకీయ జోక్యం ప్రశ్నార్థకమైంది. భవిష్యత్తులో పారదర్శక నామినేషన్లకు దారితీసే తీర్పు అని చెప్పొచ్చు. ప్రభుత్వం తాజాగా నామినేట్ చేసే పేర్లు కూడా తుది తీర్పునకే లోబడి ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 17వ తేదీకి వాయిదా వేసింది.
2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రిమండలి 2024 జనవరి 27న ప్రొఫెసర్ ఎం. కోదండారాం , జర్నలిస్ట్ అమీర్ అలీ ఖాన్ లను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. గవర్నర్ ఈ నామినేషన్లను ఆమోదించారు. దాసోజు శ్రవణ్ , కుర్ర సత్యనారాయణ గవర్నర్ తమ నామినేషన్లను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. హైకోర్టు బెంచ్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సెప్టెంబర్ 2023లో శ్రవణ్, సత్యనారాయణ నామినేషన్లను తిరస్కరించిన ఆదేశాన్ని రద్దు చేసింది, గవర్నర్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5) కింద మంత్రిమండలి సలహా మేరకు పనిచేయాలని పేర్కొంది. కోదండరాం , అమీర్ అలీ ఖాన్ నామినేషన్ నోటిఫికేషన్ను రద్దు చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com