SC: నెరవేరిన కల... అమల్లోకి ఎస్సీ వర్గీకరణ

షెడ్యూల్డ్ కులాల్లో (ఎస్సీ) బాగా వెనుకబడి, రిజర్వేషన్ల ఫలాలను సరిగా పొందలేకపోయిన కులాల కల నెరవేరింది. సుదీర్ఘ పోరాటానికి ప్రతిఫలం దక్కింది. తెలంగాణలో ఎస్సీలకు ఇప్పటివరకు గంపగుత్తగా అమలైన 15శాతం రిజర్వేషన్లు.. ఇక నుంచి వర్గీకరణ ప్రకారం అందనున్నాయి. అందులోనూ గ్రూపులు, కులాల ప్రాధాన్యతా క్రమంలో ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయనున్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఎస్సీ గ్రూపులు, కులాల వారీగా అందే రిజర్వేషన్ల వివరాలతో కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెంబర్ 9ని విడుదల చేసింది. మంత్రులు... ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లి.. ఎస్సీ రిజర్వేషన్ల అమలు జీవో తొలి కాపీని అందించారు. జీవో అమల్లోకి వచ్చినప్పటి నుంచి వెలువడే అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రకటనలు, విద్యా సంస్థల ప్రవేశాలకు వర్గీకరణ వర్తించనుంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దేశంలో ఎస్సీ వర్గీకరణను పూర్తి చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచి... సరికొత్త చరిత్రకు నాంది పలికింది.
వర్గీకరణ ఇలా..
59 ఎస్సీ కులాలను మూడు గ్రూప్‌లుగా విభజిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీరో విడుదల చేసింది. మొదటి గ్రూప్‌లో ఉన్న వారికి ఒక శాతం రిజర్వేషన్, రెండో గ్రూప్‌లో ఉన్నవారికి 9 శాతం, మూడో గ్రూప్‌లో ఉన్న వారికి 5 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయని జీవోలో పేర్కొంది. జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ తెలంగాణలోని 59 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించి, జనాభా శాతం ఆధారంగా 15 శాతం రిజర్వేషన్‌ను పంచింది.
ఎవరికి ఎంత శాతం అంటే...
గ్రూప్-1లో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, అత్యంత వెనుకబడిన 15 కులాలను చేర్చి 1శాతం, గ్రూప్-2లో మాదిగ, దాని ఉప కులాలను కలిపి 18 కులాలకు 9శాతం, గ్రూప్-3లో మాల, దాని ఉపకులాలను కలిపి 26 కులాలకు 5శాతం రిజర్వేషన్‌ను కేటాయించింది. గ్రూప్-1లో 1,71,625 మంది, గ్రూప్-2లో 32,74,377 మంది, గ్రూప్-3లో 17,71,1682 మంది జనాభా ఉన్నారని ఏకసభ్య కమిషన్ వెల్లడించింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఎస్సీ రిజర్వేషన్ల అమలుకు గ్రూపుల వారీగా ప్రాధాన్యత క్రమం అనుసరించాలని కమిషన్ ప్రతిపాదించింది. గ్రూప్-1లోని కులాల వారితో ఖాళీలు భర్తీ కాకపోతే.. గ్రూప్-2లోని వారితో, గ్రూప్-2లో భర్తీకాని ఖాళీలను గ్రూప్-3లోని కులాల వారితో భర్తీ చేయాలని సూచించింది. ఈ మూడు గ్రూపుల్లో తగిన అభ్యర్థులు లేకపోతే ఖాళీలను తర్వాతి నోటిఫికేషన్‌కు కొనసాగించాలని పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com