Bonalu 2022: తెలంగాణలో బోనాలకు సర్వం సిద్ధం.. ఏర్పాట్లపై తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష..

Bonalu 2022: తెలంగాణలో బోనాలకు సర్వం సిద్ధం.. ఏర్పాట్లపై తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష..
Bonalu 2022: భాగ్యనగరవాసులు భక్తిశ్రద్దలతో నిర్వహించుకునే బోనాల ఉత్సవాలకు సమయం ఆసన్నమైంది.

Bonalu 2022: భాగ్యనగరవాసులు భక్తిశ్రద్దలతో నిర్వహించుకునే బోనాల ఉత్సవాలకు సమయం ఆసన్నమైంది. ఈనెల 30వ తేదీ నుంచి నగరంలో బోనాల సందడి ప్రారంభం కానుంది. ఈనెల 30వ తేదీన గోల్కొండ బోనాలు ప్రారంభంకానున్నాయి. అనంతరం జులై 17వ తేదీన సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు నిర్వహిస్తారు. జులై 10న ఘటల ఊరేగింపుతో లష్కర్ బోనాలు మొదలవుతాయి. అదేవిధంగా జులై18న బోనాల మరుసటి రోజు రంగం నిర్వహించి భవిష్యవాణి వినిపిస్తారు. జులై 24వ తేదీన ఓల్డ్ సిటీ బోనాలు జరుగుతాయి.

హైదరాబాద్ బోనాల ఏర్పాట్లపై మంత్రి తలసానిశ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన ఎంసీఆర్ హెచ్చార్సీలో సమీక్షా సమావేశంజరిగింది. ఈ సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, ఇంద్ర కరణ్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, మేయర్ విజయలక్ష్మి , GHMC , జలమండలి, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గోల్కొండ దేవాలయం, సికింద్రాబాద్ మహంకాళి దేవాలయం, అంబర్ పేట మహంకాళి దేవాలయం, ఉమ్మడి దేవాలయాలు తదితర దేవాలయాల కమిటీ సభ్యులు, బోనాల ఉత్సవాల నిర్వహకులు తదితరులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.

గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా బోనాలను నిర్వహించుకోలేకపోయాము. ఈ సంవత్సరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ సారి ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రులు తెలిపారు. బోనాలను అత్యంత వైభవంగా నిర్వహించాలనే ఆలోచనతో ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని వెల్లడించారు. బోనాల కోసం ప్రభుత్వ దేవాలయాలకే కాకుండా ప్రయివేట్ దేవాలయాలకు.. సుమారు 3 వేల దేవాలయాలకు ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు వివరించారు.

ఎలాంటి ఆటంకాలు లేకుండా బోనాల ఉత్సవాలను నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని మంత్రులు వెల్లడించారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రహదారుల మరమ్మతులు, శానిటేషన్ విభాగం ఆధ్వర్యంలో దేవాలయాల పరిసరాలలో పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. సుమారు 26 దేవాలయాలలో ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. అమ్మవారి ఊరేగింపు కోసం ప్రభుత్వం అంబారీలను ఏర్పాటు చేసి ప్రభుత్వమే పూర్తి ఖర్చులను భరిస్తుందని మంత్రులు పేర్కొన్నారు.

భక్తుల సౌకర్యార్థం పలు ప్రాంతాల్లో ఎల్ఈడీ స్క్రీన్ లు, త్రీడీ మ్యాపింగ్ లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పలు ఆలయాల వద్ద ప్రత్యేకంగా స్టేజీలు ఏర్పాటు చేసి సాంస్కృతిక శాఖ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులు తోపులాటకు గురికాకుండా పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రశాంత వాతావరణంలో బోనాల ఉత్సవాలు జరిగేలా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా శాంతి భద్రతలను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు.

భక్తుల కోసం వాటర్ ప్యాకెట్ లను అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాలు, అంబులెన్స్ లను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా భాగ్యనగరవాసులు బోనాల ఉత్సవాలను నిర్వహించుకోలేకుండాపోయారు.

ఈ సారి కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఎప్పటిలాగే ఆనందోత్సహాల మధ్య బోనాల ఉత్సావాలను నిర్వహించుకునేందుకు నగర వాసులుసిద్దమవుతున్నారు. ఈనేపథ్యంలో ప్రభుత్వం సైతం అందుకోసం నగరవ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో భారీగా ఏర్పాట్లుచేస్తోంది. అందుకోసం నిధులను విడుదలచేసి.. తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేయనుంది.

Tags

Read MoreRead Less
Next Story