TS: తెలంగాణలో టీచర్ల బదిలీలకు షెడ్యూల్‌ ఖరారు

TS: తెలంగాణలో టీచర్ల బదిలీలకు షెడ్యూల్‌ ఖరారు

ఎట్టకేలకు తెలంగాణలో టీచర్ల బదిలీకి షెడ్యూల్‌ ఖరారు అయ్యింది. కొంతకాలంగా బదిలీలకు ఎదురుచూస్తున్న టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులపై ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబరు 3 నుంచి బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపడుతున్నట్టు ప్రకటించింది. బదిలీల కోసం గతంలో దరఖాస్తు చేయనివారికి కూడా ప్రభుత్వం ఇప్పుడు అవకాశం కల్పించింది.

హైకోర్టు అనుమతి ఇవ్వడంతో టీచర్ల బదిలీలకు మార్గం సుగుమం అయ్యింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసమే షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈనెల 3 నుంచి 5 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తారు. 8, 9 తేదీల్లో సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. గత మార్చిలో దరఖాస్తులు సమర్పించినవారు సైతం వివరాల్లో సవరణలు చేసుకోవచ్చని.. ఇప్పటికీ దరఖాస్తు చేయనివారి కోసం మరో అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం తెలిపింది.


ప్రభుత్వ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబరు 12, 13 తేదీల్లో గ్రేడ్-2 హెచ్ఎంల బదిలీలకు వెబ్ ఆప్షన్లు ఇస్తారు. సెప్టెంబరు 15న గ్రేడ్-2 ప్రధాన ఉపాధ్యాయుల బదిలీలు చేపడతారు. సెప్టెంబరు 17 నుంచి 19 వరకు స్కూల్ అసిస్టెంట్లకు హెచ్‌ఎంగా పదోన్నతులు కల్పిస్తారు. సెప్టెంబరు 20, 21తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ బదిలీలకు వెబ్ ఆప్షన్ల ఇచ్చి.. సెప్టెంబరు 23, 24న స్కూల్ అసిస్టెంట్లను బదిలీ చేస్తారు. సెప్టెంబరు 26 నుంచి 28న ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తారు. ఇక సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 1 వరకు ఎస్జీటీల బదిలీలకు వెబ్ ఆప్షన్లు ఇచ్చి..అక్టోబర్ 3న ఎస్జీటీల బదిలీలు చేపడతారు. ఇక బదిలీలపై అక్టోబర్‌ 5 నుంచి 19 వరకు అప్పీళ్లకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.

ఇక గత జనవరి 25న ఇచ్చిన జీవో 5లోని నిబంధనలే బదిలీలకు వర్తిస్తాయని తెలిపింది. గతంలో ఫిబ్రవరి 1ని కటాఫ్‌ తేదీగా నిర్ణయించగా.. తాజాగా దాన్ని సెప్టెంబరు 1గా ఖరారు చేశారు. అంటే ఒక పాఠశాలలో ఆ తేదీ నాటికి ప్రధానోపాధ్యాయులు అయిదేళ్లు, ఉపాధ్యాయులు ఎనిమిదేళ్లు పనిచేస్తే దీర్ఘకాలికంగా పనిచేయడం కింద పరిగణించి తప్పనిసరిగా బదిలీ చేస్తారు. వారు దరఖాస్తు చేసుకోకున్నా విద్యాశాఖ బదిలీ చేస్తుంది. ఒకవేళ దరఖాస్తు చేసుకుంటే పాయింట్ల ఆధారంగా సీనియారిటీని నిర్ణయించి బదిలీ చేస్తారు.

బదిలీ కోరుకునే ఉపాధ్యాయులు సెప్టెంబరు 1 నాటికి కనీసం రెండేళ్లు ఒక పాఠశాలలో పనిచేసి ఉండాలి. అయిదు, ఎనిమిది సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న హెచ్‌ఎంలు, ఉపాధ్యాయుల స్థానాలను ఖాళీలుగా జాబితాలో చేరుస్తారు. మరోవైపు పదవీ విరమణకు మూడేళ్లలోపు సర్వీసున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. ఉపాధ్యాయుల బదిలీలను పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని, ఎలాంటి అపోహలకు తావివ్వవద్దని అధికారులను విద్యాశాఖ మంత్రి సబిత ఆదేశించారు. ఆన్‌లైన్‌ ప్రక్రియలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Tags

Next Story