తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి మోగనున్న బడి గంట!

తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి మోగనున్న బడి గంట!
ఇక తరగతి గదిలోకి వచ్చే విద్యార్థులకు థర్మల్‌ స్ర్కీనింగ్‌, చేతులను శానిటైజ్‌ చేస్తారు. జ్వరం, జలుబు, దగ్గు, తదితర లక్షణాలు ఉంటే వెనక్కి పంపుతారు.

దాదాపు పది నెలల సుదీర్ఘ విరామం తర్వాత.. తెలంగాణ వ్యాప్తంగా రేపు స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోనున్నాయి. ప్రస్తుతం కరోనా అదుపులోకి రావడం, అలాగే వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రావడంతో విద్యాసంస్థలను క్రమంగా ప్రారంభిస్తున్నారు. పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌తోపాటు వృత్తివిద్యా కళాశాలలన్నీ రేపు తెరుచుకోబోతున్నాయి. మొత్తంగా 30 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యే అవకాశాలున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు 70శాతానికి పైగా తల్లిదండ్రులు సమ్మతి పత్రాలు సమర్పించినట్టు తెలుస్తోంది.

ఇప్పటికే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల్లో పారిశుధ్య, శానిటైజేషన్‌ పనులు పూర్తయ్యాయి. వసతి గృహాలు ప్రారంభంకానుండటంతో హాస్టల్‌ గదులు, ఆవరణ, వంట శాలలను శుభ్రం చేశారు. ఇక కొవిడ్‌ నిబంధనలతో తరగతులు నిర్వహించబోతున్నారు అధికారులు. ఒక్కో తరగతి గదిలో విద్యార్థుల మధ్య ఆరు అడుగుల దూరం ఉండేలా గది వైశాల్యాన్ని బట్టి 20 నుంచి 30మందిని కూర్చోబెడతారు. విద్యార్థులు మాస్క్‌ ధరించాల్సి ఉంటుంది. వాటర్‌ బాటిళ్లు ఇంటి నుంచే తెచ్చుకోవాలి. పాఠశాలకు పంపేందుకు తల్లిదండ్రుల అంగీకారపత్రం ఇవ్వాల్సి ఉంటుంది.

ఇక తరగతి గదిలోకి వచ్చే విద్యార్థులకు థర్మల్‌ స్ర్కీనింగ్‌, చేతులను శానిటైజ్‌ చేస్తారు. జ్వరం, జలుబు, దగ్గు, తదితర లక్షణాలు ఉంటే వెనక్కి పంపుతారు. అలాగే ప్రతి పాఠశాలలో ఐసోలేషన్‌ గదులు ఏర్పాటు చేస్తున్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, వసతి గృహాల్లో పాత మెనూ ప్రకారం ఆహారాన్ని అందించనున్నారు. పిల్లలు చేతులు కడుక్కునేందుకు.. సోప్, లోషన్లు, శానిటైజర్లు సిద్ధంగా ఉంచారు. ఇప్పటి వరకు 9, 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు 46 శాతం మంది, ఇంటర్‌ విద్యార్థుల తల్లిదండ్రులు 56శాతం మంది అంగీకారపత్రాలు ఇచ్చారు. తరగతులకు నేరుగా హాజరు కాని విద్యార్థుల కోసం ఆన్‌లైన్‌ పాఠాలు యథావిధిగా కొనసాగుతాయి. టైం టేబుల్‌, పాఠశాలల సమయంలో ఎలాంటి మార్పు చేయలేదు అధికారులు.

ఇక ఇప్పటికే సెప్టెంబర్ నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభం కాగా, 115 రోజుల పాటు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 30శాతానికి పైగా సిలబస్ పూర్తయింది. మిగతా శాతాన్ని అంటే.. 89 రోజుల సిలబస్ రేపటి నుంచి మే మొదటి వారంలోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. మే 7 నుంచి 13 వరకు.. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు, మే 17 నుంచి 26 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

మరోవైపు స్కూళ్లు ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు ఉంటాయి. హైదరాబాద్‌ జిల్లాలో ఉదయం 8:45 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఉండొచ్చని తెలుస్తోంది. అలాగే కాలేజీలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఉంటాయి. ఇంటర్‌ కాలేజీల్లో ఒకరోజు ఫస్టియర్‌, రెండో రోజు సెకండియర్‌ తరగతులు నిర్వహించనున్నారు. అటు డిగ్రీ, పీజీ కళాశాలలో 50 మందికి మించి విద్యార్థులుంటే.. తరగతులను రెండు బ్యాచ్‌లుగా నిర్వహిస్తారు. డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌, ఇతర వృత్తివిద్యా కాలేజీల్లో రోజుకు 50శాతం మంది విద్యార్థులను అనుమతించేలా ప్లాన్ చేస్తున్నారు అధికారులు.

Tags

Next Story