SUMMER: తెలంగాణలో భానుడి భగభగలు

తెలంగాణలో భానుడి భగభగలు మొదలయ్యాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు పండ్లు, పండ్లరసాలు తీసుకుంటున్నారు. ఎండ నుంచి రక్షించే గొడుగులు, టోపీలకూ గిడిమాండ్ పెరిగింది. మరికొద్ది రోజులు ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉండటంతో.....తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటోంది వాతావరణ శాఖ. ఎండలు మండిపోతున్నాయి. మార్చిలోనే పలు జిల్లాల్లో ఉష్ఱోగ్రతలు 42 డిగ్రీలు దాటడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. వేసవి తాపం తీర్చుకోవడానికి.. ప్రజలు శీతల పానీయాలు, పండ్ల రసాలు తాగుతున్నారు. శరీరం కోల్పోయిన లవణాలు భర్తీ చేసుకునేందుకు ఎక్కువగా నిమ్మరసం తాగుతున్నారు. తోపుడుబండ్లపై భారీ కుండల్లో... పుదీనా ఆకులతో కలిపిన నిమ్మరసాన్ని విక్రయిస్తున్నారు. పానీయాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని విక్రయదారులు చెబుతున్నారు.
మట్టి కుండలకు కూడా మంచి గిరాకీ ఉంది. కుండలో గ్లాసులు ముంచాల్సిన అవసరం లేకుండా నల్లా బిగించినవి అందుబాటులో ఉన్నాయి. మట్టితో చేసిన.. నీసా సీసాలు కూడా బాగా అమ్ముడుపోతున్నాయి. ఒకసారి ఈ బాటిల్‌లో నీరు నింపితే అరగంటలో చల్లగా మారతాయి. రోడ్ల పక్కన జూస్ సెంటర్లు ఎండకాలంలో ఎంతో ఉపయోగపడుతున్నాయని ప్రజలు అంటున్నారు.
ఎండల తీవ్రత ఇంకా పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. నీళ్లు బాగా తాగాలని... శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఎండ నుంచి చర్మాన్ని రక్షించుకోవాలని సూచిస్తున్నారు. వడదెబ్బ తగలకుండా టోపీలు, చలువ కళ్లజోడు, గొడుగు వాడాలని స్పష్టంచేస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎండకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రజలు ప్రాధాన్యం ఇస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com