SEC: మోగిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నగరా

తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 166 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎస్ఈసీ రాణి కుముదిని మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించి ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే దఫాలో ఒకే రోజున ఈ ఎన్నికలు నిర్వహించబోతున్నామని, రీ పోలింగ్ ఎక్కడైనా అవసరం ఉంటే ఫిబ్రవరి 12న నిర్వహించి మిగతా అన్ని స్థానాలతోపాటే ఓట్ల లెక్కింపు చేపడతామన్నారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపత్యంలో తక్షణమే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 16న మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్, డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్ పర్సన్ల ఎన్నిక ఉంటుందని తెలిపారు. ఈ ఎన్నికలో మొత్తం 52,43,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఈ మున్సిపల్ ఎన్నికలతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్సాహం నెలకొననుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఇది బలపరీక్షగా మారనుండగా, పట్టణ ప్రాంతాల్లో ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే కీలక ఎన్నికలుగా ఇవి నిలవనున్నాయి. అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, పట్టణ పాలన వంటి అంశాలు ప్రధాన అజెండాగా మారే అవకాశముంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రాజకీయ కార్యకలాపాలు వేగం పుంజుకోనున్నాయి. భారీ సంఖ్యలో ఓటర్లు పాల్గొనే ఈ ఎన్నికలు తెలంగాణ పట్టణ రాజకీయాల దిశను నిర్దేశించనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల ముఖ్య తేదీలు...
* జనవరి 28 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
* జనవరి 30తో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ గడవు
* జనవరి 31న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన
* ఫిబ్రవరి 3.. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
* ఫిబ్రవరి 11న పోలింగ్
* రీపోలింగ్ ఎక్కడైనా ఉంటే ఫిబ్రవరి 12న నిర్వహిస్తారు
* ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు
* ఫిబ్రవరి 16న మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక
* ఫిబ్రవరి 16న కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక
* మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న 53 లక్షల మందికి పైగా ఓటర్లు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
