SEC: స్థానిక ఎన్నికల్లో పోటీకి అర్హులెవరు.? అనర్హులెవరు..?

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. మొత్తం 5 దశల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, 3 దశల్లో సర్పంచ్, వార్డు ఎన్నికలకు ఇటీవల రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాణి కుముదిని షెడ్యూల్ విడుదల చేశారు. అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. త్వరలో ఎన్నికలు జరగనున్నందున అభ్యర్థుల అర్హతలు, నామినేషన్, డిపాజిట్ నగదు, వ్యయం పరిమితులపై తెలంగాణ ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది.
అర్హతలపై ఎస్ఈసీ నిబంధనలు
* అంగన్‌వాడీ కార్యకర్తలు, గ్రామ సేవకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ఎయిడెడ్ సంస్థలు, స్థానిక సంస్థల్లో పనిచేసే వారు పోటీకి అనర్హులు.
* శాసనసభ లేదా పార్లమెంటు చేసిన చట్టం కింద ఏర్పాటయ్యే సంస్థలోని ప్రతినిధి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడు కాదు. పూర్తిస్థాయి బధిరులు, మతిస్థిమితం లేనివారు అనర్హులు. మతసంబంధమైన సంస్థల ఛైర్మన్లు, సభ్యులకూ పోటీ చేసేందుకు అవకాశం లేదు.
* సింగరేణి, ఆర్టీసీలలో మేనేజింగ్ ఏజెంట్, మేనేజర్ లేదా సెక్రటరీ హోదాలో పనిచేసే వారు కాకుండా ఇతర ఉద్యోగులు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు. రేషన్ డీలర్లూ ఈ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు.
* క్రిమినల్ కోర్టులో కొన్ని నేరాలకు శిక్ష పడిన వ్యక్తి, శిక్ష విధించిన తేదీ నుంచి ఐదేళ్ల వరకు ఎన్నికకు అనర్హుడవుతాడు. పౌరహక్కుల పరిరక్షణ చట్టం-1955 పరిధిలోకి వచ్చే కేసుల్లో శిక్ష పడినవారు పోటీకి అనర్హులుగా ఎస్ఈసీ పేర్కొంది.
* పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్‌లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏదైనా పనికి కాంట్రాక్టు చేసుకున్నా లేదా నిర్వహణకు ఒప్పందం చేసుకున్న వారు(గుత్తేదారులు) పోటీకి అర్హత ఉండదు.
* భారత రాజ్యాంగం నిర్దేశించిన రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాల్లో భాగంగా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై హామీలను ఇవ్వొచ్చు.
* వాగ్దానాల(హామీల) తర్కం, అమలు, విశ్వసనీయత, ఆర్థిక స్తోమతలను ప్రణాళిక ప్రతిబింబించాలి.
* రాజ్యాంగ ఆదర్శాలకు విరుద్ధమైన, ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని ఇతర నిబంధనలకు వ్యతిరేకంగా ఉండే హామీలు ఉండొద్దు. ఎన్నికల ప్రక్రియ స్వచ్ఛతకు భంగం కలిగించేలా, ఓటు హక్కు వినియోగంలో ఓటర్లపై ప్రభావాన్ని చూపే విధంగా హామీలు చేయకూడదు.
* స్థానిక ఎన్నికల ఏ దశలో అయినా ప్రణాళికను విడుదల చేయొచ్చు. పోలింగ్ ప్రక్రియ ముగియడానికి రెండు రోజుల ముందు మాత్రం నిషేధం.
ఏజెంట్లుగా వారు వద్దు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లపై అనుచిత ప్రభావాన్ని నివారించేందుకు అధికార, రాజకీయ హోదాలు ఉన్నవారిని పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించొద్దని ఎస్ఈసీ ఆదేశించింది. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, పురపాలిక, జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్, జాతీయ, రాష్ట్ర, జిల్లా సహకార సంస్థల ఛైర్పర్సన్లు, వైస్ ఛైర్పర్సన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు లాంటి వారిని ఏజెంట్లుగా పెట్టొద్దని తెలిపింది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రూపొందించే మ్యానిఫెస్టోలో నెరవేర్చగల, హేతుబద్ధమైన హామీలను మాత్రమే పొందుపర్చాలని రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) నిర్దేశించింది. ఓటర్లపై అనవసర ప్రభావాన్ని చూపే వాగ్దానాలను నివారించాలని పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com