రోజుకో మలుపు తీసుకుంటున్న హైదరాబాద్‌లో కిడ్నాప్ కేసు

రోజుకో మలుపు తీసుకుంటున్న హైదరాబాద్‌లో కిడ్నాప్ కేసు
ఓవరాల్‌గా బెయిల్‌ పిటిషన్‌పై కోర్టు తీర్పు ప్రతికూలంగా రావడంతో అఖిలప్రియను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

హైదరాబాద్‌లో కలకలం రేపిన కిడ్నాప్ వ్యవహారం కేసు రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది. తమపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అఖిల ప్రియ అరెస్ట్ జరిగిందని భూమా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ సోదరి అరెస్ట్ వెనుక భూవివాదమే కాకుండా, ఇతర రాజకీయ కారణాలు కూడా ఉన్నాయనీ వారు తేల్చిచెబుతున్నారు. అయితే తన అరెస్ట్ పై భూమా అఖిల ప్రియ ఇప్పటికే బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సికింద్రాబాద్ కోర్టులో అఖిల ప్రియ బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. పిటీషనర్ గర్భిణి అనీ, రాజకీయంగా కక్ష సాధింపుల నిమిత్తమే ఆమెను అరెస్ట్ చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఆమె ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరారు. విచారణకు పూర్తిగా సహకరిస్తామనీ, విదేశాలకు వెళ్లమని కూడా తెలిపారు. అయితే ఆమెకు బెయిల్ ఇవ్వొద్దంటూ పోలీసుల తరపు న్యాయవాది బలంగా వాదించారు.

అఖిల ప్రియ రాజకీయ నాయకురాలనీ, సాక్ష్యాలను ప్రభావితం చేసే శక్తి ఆమెకు ఉందని న్యాయమూర్తికి విన్నవించారు. కిడ్నాప్ కేసు విచారణ కీలక దశలో ఉందనీ, ఈ తరుణంలో ఆమెకు బెయిల్ ఇస్తే విచారణ వేగం తగ్గిపోతుందని స్పష్టం చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి భూమా అఖిల ప్రియ బెయిల్ పిటిషన్‌ను రద్దు చేశారు. పోలీసులు ఏడు రోజుల కస్టడీ కోరగా.. కోర్టు మూడు రోజులకు అనుమతించింది. అఖిలప్రియను జనవరి 13 వరకు కస్టడీలోకి తీసుకోవచ్చని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే విచారణ సమయంలో ఆమె తరపు న్యాయవాది ఆమెతో మాట్లాడవచ్చునని స్పష్టం చేశారు. భూమా అఖిలప్రియకు కావాల్సిన వైద్య సహాయంలో కూడా అలక్ష్యం చేయొద్దని సూచనలు చేశారు.

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో మరో ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశామన్నారు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్. అఖిలప్రియ పర్సనల్ అసిస్టెంట్‌ బోయ సంపత్‌ కుమార్, డ్రైవర్‌ చెన్నయ్య, మల్లికార్జున రెడ్డిని అరెస్ట్ చేసి టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. మూడు మెబైల్‌ ఫోన్లు, ఫేక్‌ నెంబర్‌ ప్లేట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జనవరి 2వ తేదీన మల్లికార్జున్‌ రెడ్డి ద్వారా అఖిలప్రియ 6 సిమ్‌ కార్డులు కొనుగోలు చేశారని.. ఇవి మల్లికార్జున్‌ రెడ్డి, శ్రీను పేర్లపై తీసుకున్నారని చెప్పారు. ఇందులో ఒక సిమ్‌ కార్డును అఖిలప్రియ.. మరికొన్ని సిమ్‌ కార్డులను గుంటూరు శ్రీను ఉపయోగించారని సీపీ తెలిపారు. కిడ్నాప్‌నకు సంబంధించిన అన్ని ఆధారాలు సేకరించామన్నారు.

అఖిలప్రియ ఆధ్వర్యంలో కిడ్నాప్‌కు ముందే రెక్కీ నిర్వహించారని.. వీరు కూకట్‌పల్లిలోని ప్రదా గ్రాండ్‌లో బస చేశారని గుర్తించారు. లోధా అపార్ట్‌మెంట్‌లో కిడ్నాప్ ప్లాన్‌ జరిగినట్లు సీపీ అంజనీకుమార్ చెప్పారు. అటు.. గుంటూరు శ్రీనుతో భార్గవ్‌ రామ్ టచ్‌లో ఉన్నట్లు చెప్పారు. అఖిలప్రియ సమక్షంలోనే ఈ ఆపరేషన్‌ మొత్తం జరిగిందన్న సీపీ.. క్రైం రూట్‌ను వివరించారు.

ఓవరాల్‌గా బెయిల్‌ పిటిషన్‌పై కోర్టు తీర్పు ప్రతికూలంగా రావడంతో అఖిలప్రియను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story