Secunderabad: సికింద్రాబాద్‌ అల్లర్ల కేసు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు..

Secunderabad: సికింద్రాబాద్‌ అల్లర్ల కేసు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు..
Secunderabad: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో విధ్వంసం సృష్టించిన కేసులో దర్యాప్తు వేగవంతమైంది.

Secunderabad: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో విధ్వంసం సృష్టించిన కేసులో దర్యాప్తు వేగవంతమైంది. సెంట్రల్ ఇంటలిజెన్స్ బ్యూరో, ఇన్‌కం ట్యాక్స్‌ అధికారులు సైతం రంగంలోకి దిగారు. పల్నాడు జిల్లా నరసారావుపేటలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీం పర్యటిస్తోంది. అల్లర్లకు సూత్రదారిగా అనుమానిస్తున్న ఆవుల సుబ్బారావు నిర్వహించే సాయి డిఫెన్స్‌ అకాడమీని అధికారులు జల్లెడ పడుతున్నారు. రికార్డులు, డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు.

సికింద్రాబాద్‌ అల్లర్ల సూత్రధారిగా అనుమానిస్తున్న ఆవుల సుబ్బారావును పూర్తి స్థాయిలో విచారిస్తున్నామన్నారు పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి. అయితే అల్లర్లకు ప్రేరేపించినట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్‌తో మరింత లోతైన దర్యాప్తు చేస్తున్నామన్నారు. మరోవైపు కొన్ని అకాడమీల ఛైర్మన్లు అభ్యర్ధులను రెచ్చగొట్టినందునే విధ్వంసం జరిగిందని నిర్దారణకు వచ్చారు. ఇందులో భాగంగానే సాయి డిఫెన్స్ అకాడమీ యజమాని ఆవుల సుబ్బారావుపై దర్యాప్తు అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసు రిమాండ్ రిపోర్టు TV5 చేతికి అందింది. రిపోర్టులో కీలక విషయాలు బయటపడ్డాయి. విధ్వంసంలో మొత్తం 56 మంది నిందితుల హస్తం ఉండగా.. వీరంతా ఫిజికల్, మెడికల్ ఫిట్నెస్ పరీక్షల్లో పాసయి ఎప్పుడెప్పుడు ఎగ్జామ్‌ డేట్ వస్తుందా అని ఎదురుచూస్తున్నవాళ్లే. ఐతే ఈ టైంలోనే కేంద్రం అగ్నిపథ్‌ లాంచ్ చేయడంతో వారంతా రగిలిపోయారు. కేంద్రానికి వ్యతిరేకంగా వాట్సప్‌ గ్రూపులు క్రియేట్ చేసి అందులోనే విధ్వంస రచన చేశారు.

సికింద్రాబాద్‌ అల్లర్లకు కారణమైన 56మంది నిందితుల్లో పోలీసులు ఇప్పటికే 45 మందిని అరెస్ట్ చేశారు. మిగతా 11మంది పరారీలో ఉన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవాళ్లలో ప్రధాన నిందితుడితో పాటు A13 నుంచి A56 వరకు ఉన్నారు. A2 నుంచి A12 వరకు పరారీలో ఉన్నారు. కేసులో ప్రధాన నిందితుడిగా మదుసుధన్‌ను గుర్తించారు. 18 మంది ప్రత్యక్ష సాక్షులను విచారించిన అనంతరం రిమాండ్ రిపోర్టును విడుదల చేశారు పోలీసులు.

అనుకున్న ప్లాన్ ప్రకారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు 2వేల మంది విద్యార్థులు సికింద్రాబాద్ స్టేషన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. స్టేషన్‌కు వచ్చేటపుడే పెట్రోల్ వెంట తేవాలని కొందరి సూచనలు కూడా చేశారు. నినాదాలు చేస్తూ ప్లాట్ ఫారమ్ నంబర్‌ 1, గేట్ నంబర్‌ 3 నుంచి ఎంట్రీ ఇచ్చిన విద్యార్థులు.. ఒక్కసారిగా రైళ్లపై రాడ్లు, కర్రలతో దాడి చేశారు. ఈక్రమంలోనే ఫ్లాట్ ఫారమ్ నంబర్ 10పై ఉన్న రైల్లో 4 వేల లీటర్ల HSD... 3వేల లీటర్ల ట్రాన్స్ఫార్మర్ ఆయిల్‌తో 2 ఇంజన్లు ఉన్నాయి. వీటికి నిప్పు పెట్టేందుకు నిందితులు ప్రయత్నం చేశారు.

అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులపై రాళ్ల దాడికి దిగారు. ఇంజన్లకు నిప్పు పెడితే భారీనష్టం జరుగుతుందని భావించిన పోలీసులు కాల్పులకు దిగారు. దీంతో ఓ విద్యార్థి చనిపోవడంతో పాటు పదిమందికి పైగా గాయాలయ్యాయి. విధ్వంసం వెనుక ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీల హస్తం ఉన్నట్లుగా తేల్చారు పోలీసులు. కొందరు కావాలనే విద్యార్థుల్ని రెచ్చగొట్టినట్లు గుర్తించారు. ఐతే అల్లర్లకు సూత్రధారిగా అనుమానిస్తూ అరెస్ట్ చేసిన ఆవుల సుబ్బారావు పేరు రిమాండ్ రిపోర్ట్‌లో కనిపించకపోవడం హాట్ టాపిక్‌గా మారింది.

Tags

Read MoreRead Less
Next Story