Amit Shah : అమిత్‌షా హైదరాబాద్ టూర్‌లో మిస్టరీ కార్..

Amit Shah : అమిత్‌షా హైదరాబాద్ టూర్‌లో మిస్టరీ కార్..
X
Amit Shah : కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పర్యటనలో భద్రతా వైఫల్యంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి

Amit Shah : కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పర్యటనలో భద్రతా వైఫల్యంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అమిత్‌షా కాన్వాయ్‌ హరిత ప్లాజాలోకి వస్తుండగా ఎంట్రన్స్‌ వద్ద ఓ రెడ్‌ కలర్‌ బ్రిజా కారు ఆగిపోయింది. అమిత్‌షా కాన్వాయ్‌ వచ్చే ముందు కారు ఆగిపోవడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. కారు పక్కకు తీయకపోవడంతో సెక్యూరిటీ, పోలీసులు.. కారు వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా భద్రతా సిబ్బంది అడ్డుగా వచ్చిన కారు వెనుక అద్దాలు పగులగొట్టారు. ఆ తర్వాత దర్యాప్తు చేపట్టిన పోలీస్ ఉన్నతాధికారులు.. కారు యజమాని మంచిర్యాల జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన టీఆర్ఎస్ నేత గోసుల శ్రీనివాస్‌గా గుర్తించారు.

కారు యజమాని గోసుల శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు.. విచారించారు. అమిత్ షా టూరు భద్రతా వైఫల్యంపై సమీక్షించిన ఎస్పీ, ఇంటెలిజెన్స్ అధికారులు.. కేంద్ర హోంశాఖకు నివేదిక ఇచ్చారు. ఇటు రాష్ట్ర ఉన్నతాధికారులు కూడా ఈ ఘటనపై సీరియస్‌ అయ్యారు. ఉద్దేశపూర్వకంగా అమిత్‌ షా కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశాడా... లేక కారులో సాంకేతిక లోపమా అనే కోణంలో కూడా శ్రీనివాస్‌ను ప్రశ్నించారు.

మరోవైపు.. కేంద్రమంత్రి అమిత్‌షా పర్యటనలో భద్రతా వైఫల్యంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని ఎంపీ లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. కేంద్ర హోంశాఖమంత్రి పర్యటనలోనే భద్రతా వైఫల్యం ఉంటే.. ఇతరులను ఎలా రక్షిస్తారని ప్రశ్నించారు. ఇటీవల గణేష్ నిమజ్జనం సందర్భంగా అసోం సీఎం పర్యటనలో టీఆర్ఎస్ నేతలు దాడి చేశారన్న లక్ష్మణ్.. అమిత్ షా పర్యటనలో భద్రతా వైఫల్యానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు.

ఈ మధ్య అసోం సీఎం పర్యటనలో కూడా ఇలానే జరిగిందన్నారు. వినాయక నిమజ్జనాల సందర్భంగా ఎంజే మార్కెట్‌ వద్ద అసోం సీఎం హిమంత బిశ్వశర్మ మాట్లాడుతుండగా టీఆర్‌ఎస్‌ నేత మైక్‌ లాక్కునే ప్రయత్నం చేశాడు. ఈ పరిణామాలన్నింటిపై కషాయ దళం నిప్పులు చెరుగుతుంది. బీజేపీ నేతలకు భయపడే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ నిప్పులు చెరుగుతున్నారు.

Tags

Next Story