SEETHAKKA: కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు

తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ యుద్ధం తారాస్థాయికి చేరింది. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు లీగల్ నోటీసులు పంపడం సంచలనంగా మారింది. అంగన్‌వాడీ టీచర్ల కోసం ప్రభుత్వం కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్ల విషయంలో భారీగా అవినీతి జరిగిందని బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తోంది. తక్కువ ధర ఉన్న ఫోన్లను ఎక్కువ ధరకు కొనుగోలు చేశారని, ఇందులో మంత్రి సీతక్క హస్తం ఉందని పోస్టులు వైరల్ అయ్యాయి. తనతో పాటు ప్రభుత్వంపై బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని మంత్రి సీతక్క తీవ్రంగా పరిగణించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ ఆరోపణలకు బాధ్యత వహిస్తూ బీఆర్ఎస్ పార్టీ అధినేతగా కేసీఆర్‌కు ఆమె లీగల్ నోటీసులు పంపారు.
‘‘బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా నిరాధార ఆరోపణలు చేస్తూ నాపై పోస్టులు పెడుతోంది. నా ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తోంది. ఈ దుష్ప్రచారానికి ఈ పార్టీ అధినేత కేసీఆర్‌దే బాధ్యత. అందుకే 48 గంటల్లో ఆ పోస్టులు తొలగించి నాకు ఆయన క్షమాపణలు చెప్పాలి. లేకుంటే సివిల్, క్రిమినల్ చర్యలు ఉంటాయి’’ అని సీతక్క నోటీసుల్లో హెచ్చరించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలకు ఫోన్లు పంపిణీ చేశారు. అయితే, ఒక్కో ఫోన్‌ను మార్కెట్ ధర కంటే ఎక్కువకు కొనుగోలు చేసి, కమీషన్లు తీసుకున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అంతటితో ఆగకుండా సోషల్ మీడియాలో ఉధృతంగా ప్రచారం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
