Phone Tapping : ప్రణీత్‌రావు వాంగ్మూలంలో షాకయ్యే విషయాలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్వే కొద్దీ కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. మాజీ DSP ప్రణీత్‌రావు వాంగ్మూలంలోసంచలన అంశాలు వెల్లడయ్యాయి. అప్పటి S.I.B చీఫ్ ప్రభాకర్‌రావు సహకారంతో 2022లో డీఎస్పీ అయినట్లు తెలిపారు. తన పదోన్నతికి సహకరించారనే కృతజ్ఞతతో ప్రభాకర్‌రావు చెప్పిన పనులన్నీ చేశానని ప్రణీత్‌రావు ఒప్పుకున్నారు. SIB కార్యాలయంలో ప్రభాకర్‌రావు ఛాంబర్ పక్కనే.. తనకు రెండు గదులు కేటాయించారని... 56 మంది సిబ్బందితో పనిచేసినట్లు పోలీసులకు వెల్లడించారు. 17కంప్యూటర్లు, ప్రత్యేక సర్వర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తన స్నేహితులు గుండు వెంకట్రావు, బాలే రవి కిరణ్‌ను కూడా... ప్రభాకర్‌రావు సాయంతో ఇంటిలిజెన్స్‌లోనికి బదిలీ చేయించుకున్నానని ప్రణీత్‌రావు తెలిపారు. ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు ప్రతిపక్ష నేతల ప్రొఫైల్స్ క్రియేట్ చేశామని వివరించారు. ప్రత్యేకంగా ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుని.. 1000 నుంచి 1200 మంది ప్రొఫైల్స్‌ను తయారు చేసినట్లు చెప్పారు. ఐదు ఫోన్లతో... ప్రభాకర్‌రావు చెప్పినవారిని ట్రాక్ చేసినట్లు ప్రణీత్‌రావు ఒప్పుకున్నారు.
2023 ఎన్నికల ముందు భారాసకు ప్రత్యర్ధులుగా పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలను సేకరించామని వారి ఫోన్లను ట్యాప్ చేశామని ప్రణీత్‌రావు చెప్పారు. తన బృందంతో కలిసి వాళ్లకు చెందిన డబ్బును సీజ్ చేసినట్లు తెలిపారు. ఎన్నికల సంఘానికి అనుమానం రాకుండా ఆ డబ్బును హవాల సొమ్ముగా రికార్డుల్లో చూపించామని వివరించారు. భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్నకు సమాచారం అందించామన్నారు. కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నేతలకు చెందిన డబ్బుపై.. ప్రధానంగా దృష్టి పెట్టినట్లు ప్రణీత్‌రావు పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలే కాకుండా భారాసలోని కొందరి ఫోన్లనూ ట్యాపింగ్ చేసినట్లు ఒప్పుకున్నారు. ఇందుకోసం MS కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ అందించిన సాఫ్ట్‌వేర్ వినియోగించినట్లు తెలిపారు. జడ్జీలు, రాజకీయ నేతలు, స్థిరాస్తి వ్యాపారులు, వారి కుటుంబ సభ్యులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశామని వాంగూల్మంలో ప్రణీత్‌రావు పేర్కొన్నారు.
2023 లో ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. SIB కార్యాలయంలో 50 హార్డ్ డిస్కులను ధ్వంసం చేశామని ప్రణీత్‌రావు చెప్పారు. సర్వర్లు మార్చేసి.. కొత్తవి ఏర్పాటు చేశామన్నారు. గతేడాది డిసెంబర్ 4న రాత్రి ఏడున్నర గంటల నుంచి 8 గంటల 15 నిమిషాల మధ్య 45 నిమిషాల్లో ధ్వంసం చేసినట్లు తెలిపారు. లాగర్‌రూమ్‌లోని సీసీటీవీ కెమెరాలు ఆఫ్ చేసి హార్డ్ డిస్కులను తీసి ధ్వంసం చేసేందుకు.... అక్కడ సీసీటీవీ ఇంఛార్జిగా ఉన్న RSI అనిల్‌కుమార్ ఒప్పుకోలేదన్నారు. ప్రభాకర్‌రావు ఆదేశాలు ఉన్నాయని... ధిక్కరిస్తే మెమో ఇవ్వాల్సి ఉంటుందని అనిల్‌కుమార్‌ను హెచ్చరించినట్లు ప్రణీత్‌రావు తెలిపారు. సీసీటీవీ కెమెరాలు ఆఫ్ చేసి.. 17 కంప్యూటర్లకు సంబంధించి హార్డ్ డిస్క్‌లను... తన ఆదేశాలతో RSI హరికృష్ణ బయటకు తీశాడని... కృష్ణ అనే హెడ్ కానిస్టేబుల్ ఎలక్ట్రిక్ కట్టర్‌తో ధ్వంసం చేశాడని వివరించారు. ఇతర సిబ్బంది సాయంతో... వాటిని నాగోల్, ముసారాంబాగ్‌లోని మూసీలో పడేసినట్లు పోలీసుల కస్టడీ విచారణలో ప్రణీత్‌రావు వాంగూల్మం ఇచ్చారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com