టీవీ నటి శ్రావణి మృతి కేసు : మూడో నిందితుడికి జ్యుడిషియల్ కస్టడీ

టీవీ నటి శ్రావణి మృతి కేసులో మూడో నిందితుడు అశోక్ రెడ్డికి 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ విధించి కోర్టు. ఉదయం అశోక్‌రెడ్డి పంజాగుట్ట పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కరోనా పరీక్షల కోసం నిందితుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల తరువాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి.. అశోక్‌రెడ్డికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు.
అశోక్ రెడ్డిని ఉదయం అదుపులోకి తీసుకున్న వెంటనే ఎస్సార్ నగర్ పోలీసులు పలు ప్రశ్నలు సంధించారు. శ్రావణితో ఆయనకు గల పరిచయంపై ఆరా తీశారు. మరో నిందితుడు సాయికృష్ణారెడ్డితో ఎప్పటి నుంచి పరిచయముందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. శ్రావణి ఆత్మహత్యకు పాల్పడిన రోజు చోటుచేసుకున్న సంఘటనలపై అశోక్‌రెడ్డిని పోలీసులు ప్రశ్నించారు. అయితే, శ్రావణి సూసైడ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదంటున్నాడు అశోక్‌రెడ్డి. తాను ఎవరితోనూ ఫోన్‌లో మాట్లాడలేదని...జైలు నుంచి వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుతానని అన్నాడు. తాను శ్రావణిని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదని చెప్పాడు అశోక్‌రెడ్డి.
అశోక్ రెడ్డి చెప్పినదానికి పోలీసుల విచారణలో తేలినదానికి పొంతన లేదు. సినీ రంగంలో అవకాశాలు ఇప్పిస్తానంటూ ఆశ చూపి శ్రావణితో అశోక్‌రెడ్డి సంబంధం ఏర్పరచుకున్నట్టు.. పోలీసుల విచారణలో తేలింది. ఆమె దేవరాజ్‌కు దగ్గర కావటాన్ని అశోక్ రెడ్డి జీర్ణించుకోలేకపోయాడని. సాయికృష్ణ ద్వారా ఒత్తిడి తెచ్చి ఇద్దరూ విడిపోయేలా ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఈ కేసులో నిందితుల ఆర్డర్ మార్చారు పోలీసులు. అంతకు ముందు ప్రెస్‌మీట్‌లో దేవరాజ్‌ను ఏ3గా చూపించగా.. తాజాగా అతన్ని ఏవన్‌గా మార్చారు. సుమారు 17 మంది సాక్షులను విచారించిన తర్వాత దేవరాజ్‌ను ఏవన్‌గా చేర్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏవన్ దేవరాజ్ రెడ్డి, ఏ2 సాయికృష్ణారెడ్డి పోలీసు రిమాండులో ఉన్నారు. ఈ ముగ్గురి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. త్వరలోనే అసలు నిజాలేంటో బయటకొస్తాయని అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com