SETWIN: మెరుగైన శిక్షణ.. ఉపాధి కల్పనలో సెట్"విన్"

ఉన్నత చదువులు చదివేందుకు ఆర్థికంగా అండగా లేని యువతీ యువకులకు.. సాంకేతిక విద్యను అభ్యసించినా నైపుణ్యం లేని విద్యార్థులకు... వివాహమై ఏదో ఒక పని చేసి కుటుంబానికి ఆసరాగా ఉండాలని తపించే మహిళలకు... ఇప్పుడు ఎంతో డిమాండ్ ఉన్న రంగాల్లో పట్టు సాధించాలని పరితపించే యువకులకు.... అండగా నిలుస్తోంది సెట్విన్ సంస్థ. ఏటా వేలమందికి సుశిక్షితులైన గురువులతో శిక్షణ ఇప్పిస్తూ... విద్యార్థులు ఎంచుకున్న రంగాల్లో వారిని నిష్ణాతులను చేస్తోంది. నామమాత్రపు ఫీజులు వసూలు చేస్తూ వారి భవిష్యత్తును బంగారుమయం చేస్తోంది. యువకులు, మహిళలు, విద్యార్థులు వారి కాళ్లపై వారు నిలబడి కుటుంబానికి అండగా ఉండేలా అండగా నిలుస్తోంది. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ముందుకు సాగుతూ... పేదల బతుకుల్లో వెలుగులు నింపుతోంది. దాదాపు 60కిపైగా కోర్సుల్లో కేవలం నామమాత్రపు ఫీజును మాత్రమే వసూలు చేస్తూ మెరుగైన శిక్షణ అందిస్తోంది. ఈ ఫీజు కూడా కట్టలేని నిరుపేదలకు ఎన్జీవోల సాయంతో వారే ఫీజు కట్టి మరీ శిక్షణ ఇస్తున్నారు.
అసలేమిటీ సెట్విన్..
సెట్విన్ అంటే సొసైటీ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ ప్రమోషన్ అండ్ ట్రైనింగ్ ఇన్ ట్విన్ సిటీస్. సెట్విన్ ప్రభుత్వ సంస్థ. 1978లో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పుడు ట్విన్ సిటీస్‌ను దాటి రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు, మహిళలకు శిక్షణ ఇస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 23 సెంటర్లలో సేవలను అందిస్తోంది. మరో నాలుగు సెంటర్లలోనూ కొత్తగా శిక్షణా కేంద్రాలు ప్రారంభిస్తోంది. వీరి ద్వారా మెరుగైన శిక్షణ కల్పిస్తూ... ఉపాధి కల్పించేలా చేస్తోంది.
60కి పైగా కోర్సులు
సెట్విన్ సంస్థల్లో 60కు పైగా కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. కంప్యూటర్‌లో M.S. ఆఫీస్, మల్టీమీడియా, హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్ నుంచి పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఆప్లికేషన్ వరకు చాలా కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. 3 నెలల నుంచి సంవత్సరం పాటు ఈ శిక్షణ ఉంటుంది. దీనికి ఫీజు కేవలం రూ. 1500 నుంచి రూ. 6 వేల వరకు మాత్రమే ఉంటుంది. అటో ఎలక్ట్రీషియన్, మొబైల్ రిపేరింగ్, డీజిల్ మెకానిక్, సీసీ టీవీ ఇన్‌స్టాలేషన్, సోలార్ టెక్నీషియన్స్, ఇలా అనేక టెక్నికల్ కోర్సుల్లోనూ నిపుణులైన ఉపాధ్యాయులచే శిక్షణ ఇప్పించి వారికి ఉపాధి కల్పించేందుకు సాయం చేస్తోంది. 20 శాతం ధియరీలతో 80 శాతం ప్రాక్టీకల్స్‌తో వారు ఎంచుకున్న రంగాల్లో పట్టు వచ్చేలా చేస్తోంది.
మహిళల కోసం ప్రత్యేకంగా..
మహిళలు, విద్యార్థినులకు ఉపాధి కల్పించేందుకు సెట్విన్ నిరంతరాయంగా పనిచేస్తోంది. కంప్యూటర్ కోర్సులు, బ్యుటీషీయన్, డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్, జర్దోషి, మెహిందీ డిజైన్, గార్మెట్ మేకింగ్, టెక్స్‌టైల్ డిజైనింగ్, కుట్టు మిషన్ రంగాల్లో మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. ఈ కోర్సులకు రూ. 3 వేలకు మించి ఫీజు లేదు. ఇవేకాకుండా ఎడ్యుకేషనల్ కోర్సులను కూడా అందిస్తున్నారు. ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్, క్రాఫ్ట్ కోర్సు, కాలీగ్రఫీ, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులను కూడా అందిస్తున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు వారికి క్లాసులు నిర్వహిస్తోంది.
పేదరిక నిర్మూలనే లక్ష్యం: వేణుగోపాల్ రావు, సెట్విన్ ఎండీ
" మేం పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్నాం. మొత్తం 23 కేంద్రాల్లో ప్రస్తుతం సెట్విన్ శిక్షణ కొనసాగుతోంది. మరో నాలుగు కేంద్రాలను త్వరలో ప్రారంభిస్తాం. నిధుల కొరత లేకపోయినా కాస్త సిబ్బంది కొరత ఉంది. దాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం. సెట్విన్‌లో శిక్షణ పొందేందుకు ఆంధ్రప్రదేశ్ సహా వేరే రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు వస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన వారు సెట్విన్ సర్టిఫికెట్‌తో గల్ఫ్‌లోనూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన వారు వారి కాళ్లపై వాళ్లు నిలబడితే మాకు అంతకంటే ఆనందం ఏముంటుంది" అని సెట్విన్ ఎండీ వేణుగోపాల్ రావు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com