Shaikpet Flyover: హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలురాయి.. షేక్‌పేట్ ఫ్లై ఓవర్ ప్రత్యేకత ఏంటంటే..

Shaikpet Flyover: స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు కింద హైదరాబాద్ లో చేపట్టిన ఫ్లై ఓవర్లు వరుసగా అందుబాటులోకి వస్తున్నాయి. గ్రేటర్ వాసులకు నూతన సంవత్సర కానుకగా షేక్ పేట్ ఫ్లై ఓవర్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాల్గొన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ లో జీహెచ్‌ఎంసీ నిర్మించిన అతిపొడవైన ఫ్లై ఓవర్‌గా షేక్ పేట్ ఫ్లైవర్ నిలిచింది. SRDP కింద 333.55 కోట్ల రుపాయలతో వ్యయంతో నాలుగు ప్రధాన జంక్షన్లను కలుపుతూ 2.71 కిలోమీటర్ల పొడవుతో , 24 మీటర్ల వెడల్పుతో ఆరు లేన్లుగా షేక్ పేట్ ఫ్లై ఓవర్ నిర్మించారు. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ వైపు వాహన రాకపోకలు సులువుకానుంది.2018లో ప్రారంభమైన షేక్ పేట్ నిర్మాణ పనులు.. మూడేళ్లలో పూర్తి చేశారు.
హైదరాబాద్ లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి కొత్త రోడ్డు, లింక్ రోడ్లను జీహెచ్ఎంసీ నిర్మిస్తోందన్నారు మంత్ర కేటీఆర్. ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్ ల నిర్మాణంపై ఎస్‌ఆర్‌డీపీ కీలకపాత్ర పోషిస్తోందని చెప్పారు. కంటోన్మెంట్ ప్రాంతంలోని ప్రజలు ఇరుకైన రోడ్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,ఆయా ప్రాంతాల గుండా పోయే స్కైవేలు, ఫ్లై ఓవర్లు, రోడ్ల వెడల్పుకు రక్షణశాఖతో మాట్లాడి తోడ్పాటు అందించాలని కిషన్ రెడ్డిని కోరారు.
రహదారుల మౌలిక వసతుల కల్పనకు కేంద్రం కృషి చేస్తోందని, తెలంగాణకు రీజనల్ రింగ్‌రోడ్డు మంజూరు చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో సైన్స్ సిటీ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ లెటర్ రాశానని, దానిని కేంద్రం పరిశీలిస్తోందని చెప్పారు. తెలంగాణ లో టూరిజం అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com