Sheep scheme Scam: గొర్రెల స్కీం కుంభకోణంలో కీలక అరెస్టులు
గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో తవ్వేకొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పశుగణాభివృద్ధి సంస్థ CEO రాంచదర్ నాయక్, మాజీ మంత్రి తలసాని మాజీ OSD కల్యాణ్‌ను విచారించిన అనంతరం 700 కోట్ల భారీ కుంభకోణం జరిగినట్లు ACB అంచనాకు వచ్చింది. తొలుత సుమారు 2 కోట్ల నగదు మళ్లించినట్లు ఫిర్యాదు రావడంతో ACB దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో ఇప్పటికే 10 మంది నిందితులను గుర్తించగా, ఆరుగురిని అరెస్టు చేశారు. ఇప్పటిదాకా సంయుక్త సంచాలకులు, సహాయ సంచాలకుల స్థాయి అధికారులు అరెస్టవగా ఏకంగా ఇప్పుడు CEO స్థాయి అధికారి, మాజీ మంత్రి మాజీ OSD కటకటాలపాలయ్యారు. రాంచందర్ గతంలో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌గానూ పనిచేశారు. ACB దర్యాప్తు నేపథ్యంలో ప్రభుత్వం ఫిబ్రవరిలో ఆయనను ఆ పదవి నుంచి తప్పించి పశుగణాభివృద్ధి సంస్థ సీఈవోగా నియమించింది.
లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన గొర్రెలకు కేటాయించిన నిధుల్నిపక్కదారి పట్టించారనే ఆరోపణలతో తొలుత కేసు నమోదైంది. అధికారుల ఆమ్యామ్యాల అంశం ముడిపడి ఉండటంతో ACB FIR నమోదు చేసి దర్యాప్తు ఆరంభించింది. పశుసంవర్ధక శాఖ అధికారులు తెలంగాణలోని లబ్ధిదారులను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకెళ్లి.. అక్కడి విక్రయదారుల నుంచి గొర్రెలను కొనుగోలు చేయించారు. విక్రేతలకు చెల్లించాల్సిన డబ్బులను బినామీ ఖాతాలకు మళ్లించారు. బ్రోకర్లను, ప్రైవేటు వ్యక్తులను ఏర్పాటు చేసుకొని రెండు కోట్లు మళ్లించినట్లు తేలడంతో ఆ నిధులు ఏమయ్యాయనే కోణంలో ACB దర్యాప్తు చేసింది. బినామీ ఖాతాదారులను విచారించగా బ్రోకర్లు, అధికారుల పాత్రపై ఆధారాలు లభించాయి. ఈ కుంభకోణంలో గొర్రెల కొనుగోలు కాంట్రాక్టరుగా వ్యవహరించిన మొయినుద్దీన్ కీలకంగా వ్యవహరించినట్లు ACB అధికారులు గుర్తించారు. అరెస్టయిన వారి నుంచి సేకరించిన సమాచారం, రికార్డుల ఆధారంగా రాంచందర్, కల్యాణ్‌ల పాత్ర తేటతెల్లమైంది. నాంపల్లి ACB కేసుల న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు వీరికి 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.
2015లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించి వేల మంది లబ్ధిదారులకు దాదాపు 4 వేల కోట్ల విలువైన జీవాలను పంపిణీ చేశారు. ఈ కుంభకోణంలో కొందరు పెద్దల పాత్ర ఉన్నట్లు ACB అనుమానిస్తోంది. రాంచందర్, కల్యాణ్‌ను న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించాలని నిర్ణయించింది. త్వరలోనే మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలున్నాయి. అంతకుముందు రాంచందర్ అరెస్ట్ చేసేందుకు అధికారులు మాసబ్‌ట్యాంక్‌లోని ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లారు. తమ వెంట రావాలని నిర్దేశించగా తొలుత ఆయన అంగీకరించలేదు. చివరకు బలవంతంగా తీసుకెళ్లాల్సి వచ్చింది. కొందరు సిబ్బంది అడ్డుతగిలినా... వెనక్కి తగ్గని ACB అధికారులు తీవ్రస్థాయిలో హెచ్చరించి రాంచందర్‌ను అరెస్ట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com