sheeps scam: గొర్రెలు కొనలేదు..అమ్మలేదు..వెయ్యి కోట్లు మాయం

తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో కీలక పరిణామం సంభవించింది. గొర్రెల పంపిణీ పథకం అక్రమాల విలువ రూ.1000 కోట్లు పైనే ఉంటుందని ఈడీ కీలక ప్రకటన విడుదల చేసింది. వివిధ జిల్లాల్లో ఈ స్కీం కింద ఎంత మేరకు అక్రమాలు జరిగాయో పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు అధికారులు వెల్లడించడం తీవ్ర సంచలనంగా మారింది.
తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకంలో రూ.వెయ్యి కోట్లకుపైనే అక్రమాలు జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది. గొర్రెల పెంపకం, అభివృద్ధి పథకం అమలులో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన రెండు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. గత ప్రభుత్వంలోని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఓఎస్డీగా ఉన్న జి. కల్యాణ్ కుమార్, ఇతర లబ్ధిదారులు, మధ్యవర్తుల నివాసాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అనేక ఆధారాలు సేకరించినట్లు ఈడీ అధికారులు ప్రకటించారు. వివిధ ప్రభుత్వ అధికారులకు ముడుపుల రూపంలో అక్రమ చెల్లింపులు జరిగినట్లు సూచించే పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 200కుపైగా బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన చెక్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు, డెబిట్ కార్డులు, 31 సెల్ఫోన్లు, 20 సిమ్‌కార్డులను సీజ్ చేశారు. గొర్రెల పంపిణీ స్కీం లో లబ్ధిదారులు అసలు గొర్రెల వ్యాపారంతో సంబంధం లేనివారు ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. అసలు గొర్రెల కొనుగోలు లేదా విక్రయం జరగలేదని.. కానీ వెయ్యి కోట్ల రూపాయలు మాయం చేసినట్లు పేర్కొన్నారు. నకిలీ విక్రేతలు, ఫేక్ బిల్లులను మళ్లీ మళ్లీ పేర్కొంటూ డబ్బులు దోచుకున్నట్టు ఆధారాలు గుర్తించారు. ఈడీ సోదాల్లో ప్రభుత్వ అధికారులకు, ఇతరులకు కిక్‌బ్యాక్ లకు సంబంధించిన డాక్యుమెంట్లు, నకిలీ చెక్ బుక్‌లు, పాస్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు.
రికార్డుల ఆధారంగా...
పశుసంవర్ధక శాఖ, గొర్రెలు, మేకల డెవలప్మెంట్ ఫెడరేషన్ లో సీజ్ చేసిన గొర్రెల పంపిణీ స్కీమ్ రికార్డులు, బ్యాంకు స్టేట్మెంట్ ల ఆధారంగా ఈడీ విచారణలో నిందితులను ప్రశ్నిస్తుంది. గొర్రె పిల్లల కొనుగోలు, తరలింపు, లబ్ధిదారులకు అప్పగింత, నిధుల బదలాయింపు వరకు ఆర్థిక శాఖ మంజూరు చేసిన నిధులకు సంబంధించిన రికార్డులు కీలకంగా మారాయి. నిధుల దారి మళ్లింపుకు సూత్రధారులైన కల్యాణ్ సహా మరో ఇద్దరిని అరెస్టు చేసేందుకు ఈడీ సిద్ధమవుతుంది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) నివేదిక కూడా గొర్రెల పంపిణీలో కుంభకోణం జరిగినట్లు గుర్తించింది. మార్చి 2021తో ముగిసిన కాలానికి సంబంధించిన కాగ్ నిర్వహించిన ఆడిట్లో పథకం అమలులో అనేక అవకతవకలు జరిగినట్లు వెల్లడైంది. లబ్ధిదారుల వివరాలను సరిగ్గా నిర్వహించకపోవడం, రవాణా ఇన్వాయిస్ రికార్డులు అసంపూర్ణంగా ఉండటం, నకిలీ వాహన నంబర్లతో కూడిన ఇన్వాయిస్కు చెల్లింపులు చేయడం వంటివి గుర్తించారు. తెలంగాణవ్యాప్తంగా రూ.వెయ్యి కోట్లకుపైగా అక్రమాలు జరిగాయని ఈడీ అంచనా వేసింది. ఈ కుంభకోణంలో ఎవరి పాత్ర ఎంత, ఇంకా ఎంతమంది అక్రమాలకు పాల్పడ్డారనే విషయంపై దర్యాప్తు కొనసాగిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com