అభివృద్ధి జరగాలంటే అక్కడ ఉప ఎన్నికలు రావాల్సిందేనా?

అభివృద్ధి జరగాలంటే అక్కడ ఉప ఎన్నికలు రావాల్సిందేనా?
తాజాగా నల్లగొండ జిల్లా పరిధిలోని నాగార్జునసాగర్ నియోజకవర్గ MLA నోముల నర్సింహ్మయ్య అనారోగ్య కారణాలతో చనిపోగా.. మరో ఉపఎన్నిక అనివార్యమైంది.

తెలంగాణలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగాలంటే అక్కడ ఉప ఎన్నికలు రావాల్సిందేనా అనే చర్చ జోరుగా నడుస్తోంది. ఎందుకంటే 2019 చివర్లో జరిగిన హుజుర్ నగర్ ఉప ఎన్నిక సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ చకచకా అమలయ్యాయి. హుజూర్ నగర్ రెవిన్యూ డివిజన్ కావడమేగాక.. నియోజకవర్గంలో రహదారులు, స్ట్రామ్ వాటర్ డ్రైన్లు, నిరుద్యోగుల శిక్షణ కోసం ITI, సహా ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం కోట్లాది రూపాయల నిధులు విడుదల జరిగింది.

ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని హుజూర్ నగర్ మినహాయిస్తే.. జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి ప్రాతినిద్యం వహిస్తోన్న సూర్యాపేట నియోజకవర్గంలోనూ అడపాదడపా అభివృద్ది పనులు జరుగుతున్నా.. మిగతా నియోజకవర్గాల్లో మాత్రం పరిస్థితి ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారిందనే చెప్పాలి. సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు సహా మిగతా మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆ ప్రాంతాల నాయకులు, ప్రజలు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తుండటం గమనార్హం. ఇక.. ఇటీవల దుబ్బాక ఉపఎన్నిక సందర్బంగా కోట్లాది రూపాయల పనులకు ప్రభుత్వం జీవోలను విడుదల చేసింది.

తాజాగా నల్లగొండ జిల్లా పరిధిలోని నాగార్జునసాగర్ నియోజకవర్గ MLA నోముల నర్సింహ్మయ్య అనారోగ్య కారణాలతో చనిపోగా.. మరో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకొని.. 2018 ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల జీవోలు రిలీజ్ చేయడంపై క్షేత్రస్థాయిలో సుధీర్ఘ చర్చ నడుస్తుంది. ఒక్క నాగార్జున సాగర్ కి మాత్రమే జీవోలు రిలీజ్ చేస్తే ఎన్నికల కోసమే జీవోలు ఇచ్చినట్లుగా ప్రచారం అవుతదని భావించిన ప్రభుత్వం.. పక్కనేఉన్న మిర్యాలగూడ ప్రాంతాన్ని లింక్ చేసి జీవో లు ఇచ్చినట్లు తెలుస్తోంది. సాగర్, మిర్యాలగూడ రెండు నియోజకవర్గాలకు దాదాపు 600 కోట్ల రూపాయలతో నిర్మించే ఐదు లిఫ్టు ఇరిగేషన్ స్కీంలకు ఒకేసారి జీవోలు విడుదల చేసింది ప్రభుత్వం.

మూసీనదిపై కేశావపురం దగ్గర కొండ్రపోల్ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి 75కోట్ల 93 లక్షల రూపాయలతో.. 5వేల 875 ఎకరాలకు సాగునీరు అందించేలా పరిపాలన అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం. నాగార్జునసాగర్ ఫోర్ షోర్‌పై.. నెల్లికల్ ఎత్తిపోతలకు.. 4వేల 175 ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా.. 72కోట్ల 16లక్షల రూపాయల వ్యయంతో అనుమతి ఇచ్చింది. ఇదేగాక.. చిట్యాల సమీపంలో.. బల్నేపల్లి-చంప్లాతండా ఎత్తిపోతల ప్రాజెక్టుకు 219కోట్ల 90 లక్షల వ్యయంతో.. వాడపల్లి ఎత్తిపోతలకు 229కోట్ల 25లక్షల వ్యయంతో నిర్మాణానికి పరిపాలన అనుమతులు ఇచ్చింది. AMRP ప్రాజెక్టు హై-లెవన్ కెనాల్‌, లో-లెవల్ కెనాల్ పునరుద్ధరణ కోసం 247కోట్ల 57లక్షల రూపాయలలను ప్రభుత్వం మంజూరు చేసింది.

ఇదేగాక.. నకిరేకల్ నియోజకవర్గానికి 11 కోట్ల ఎస్డీఎఫ్ గ్రాంట్స్ ఇస్తున్నట్లు ఇటీవల జీవో రిలీజ్ చేసింది ప్రభుత్వం. ఈ నిధులతో నకిరేకల్ పట్టణంలో.. రోడ్లు, డ్రైనేజీలు నిర్మించనున్నారు. ఇటీవలే నకిరేకల్ మేజర్ గ్రామ పంచాయితీ పాలకవర్గం గడువు ముగియడంతో.. మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ పాలనలోకి వచ్చింది. త్వరలో నకిరేకల్ మున్సిపాలటీకి సైతం ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికారపార్టీ గట్టెక్కేందుకే నిధులు విడుదల చేశారన్న ప్రచారం జోరుగా నడుస్తోంది.

ఎన్నికల సమయంలోనే ఇచ్చిన హామీలు ప్రభుత్వానికి గుర్తుకు వస్తున్నాయనే ప్రచారం ఊపందుకుంది. నల్లగొండ జిల్లాను దత్తత తీసుకుంటున్నట్లు 2018 ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ప్రకటించి రెండేళ్లవుతోన్నా.. ఇంతవరకు ఆ దిశగా ఎలాంటి అడుగు పడలేదు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఇప్పటికి ఎలాంటి అభివృద్ధి జరగకపోగా.. ఇచ్చిన హామీలు నెరవేరలేదని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల ముందు అధికార పార్టీ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే.. మళ్లీ ఏదొకరూపంలో ఎన్నికలు వస్తేనే అవి నెరవేరతాయనే అనే టాక్ ప్రతిపక్ష సభ్యులతో పాటు అధికార సభ్యుల్లోనూ బలంగా వినిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story