Siddipet Collector : సిద్ధిపేట కలెక్టర్ వెంకటరామరెడ్డి వ్యాఖ్యలు వివాదాస్పదం...!

Siddipet Collector : సిద్ధిపేట కలెక్టర్ వెంకటరామరెడ్డి వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వరి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని సీడ్ డీలర్లను బెదిరించడమేంటని విపక్షాలు మండిపడుతున్నాయి. యాసంగిలో ఒక్క ఎకరంలోనూ వరి సాగు కావొద్దని, రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసేలా వ్యవసాయ, మండల ప్రత్యేక అధికారులు బాధ్యత తీసుకోవాలని సూచించారు కలెక్టర్. రెవెన్యూ, వ్యవసాయ అధికారులు, విత్తన డీలర్లతో సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వ అనుమతి పొందిన డీలర్‌లు వరి విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించవద్దన్నారు. వేరుశనగ, పెసర, శనగ, నువ్వులు, సజ్జలు, ఇతర నూనె పంటలకు సంబంధించి నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని డీలర్లను ఆదేశించారు. నాసి విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కలెక్టర్ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి విత్తనాలు అమ్మొద్దని బెదిరించడం బ్లాక్ మెయిల్ చేయడమేనన్నారు. సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నా ఊరుకోను అంటూ కలెక్టర్ ఒక నియంతలా మాట్లాడుతున్నారన్నారు. ప్రభుత్వం వరి రైతుల బాధ్యతల నుంచి తప్పుకునేందుకే ఈ ఎత్తుగడ అన్నారు. వరి పంటలు వేయనప్పుడు ఇక లక్షల కోట్ల వ్యయం చేసిన ఈ ప్రాజెక్టులు ఎందుకని ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com