పాస్‌వర్డ్ మార్చేసి బ్యాంకు ఖాతాలో సొమ్మును కొల్లగొడతున్న ముఠా గుట్టు రట్టు

స్విమ్ స్వాప్ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ముంబై, కోల్‌కతా నగారాల్లో కూర్చుని కంపెనీల ఖాతాలను దర్జాగా ఖాళీ చేస్తున్నారు. ఈ తరహా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముంబై మీరారోడ్ గ్యాంగ్ ఆట కట్టించారు సైబరాబాద్ పోలీసులు. నైజీరియాకు చెందిన సైబర్ నేరగాడు జేమ్స్.. భారత్‌లోని ప్రైవేటు కంపెనీల సమాచారం సేకరించి ఆదాయపన్ను రిటర్న్స్ పేరుతో ఆయా కంపెనీలకు ఫేక్ మెయిల్స్ పంపుతుంటాడు. ఈ మెయిల్స్ పై అంతగా అవగాహన లేని సదరు కంపెనీల అకౌంటెంట్లు వారు కోరిన సమాచారాన్ని పంపుతారు. ఇంక అంతే వారి కంపెనీ ఖాతా ఖాళీ అయిపోతుంది.
ఈ తరహా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముంబై మీరారోడ్ గ్యాంగ్‌ను సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పట్టుకున్నారు. ఈ గ్యాంగ్ చంద్రకాంత్ సిద్ధాంత్ కాంబ్లీ అనే వ్యక్తి నేతృత్వంలో కొనసాగుతోంది. ఇందులో జమీర్ అహ్మద్, మునీర్, సోయబ్ షేక్, ఆదిల్ హుస్సేన్ ఆలీ సయ్యద్, జునైద్ అహ్మద్ షేక్, అశ్విన్ నారాయణ సభ్యులుగా ఉన్నారు. వీరంతా జేమ్స్ ఆదేశాలతో ఆయా కంపెనీల పేరుతో నకిలీ లెటర్‌హెడ్‌లు, ఆధార్‌కార్డులు తయారు చేస్తారు.
ప్రత్యేకించి సెలవు రోజులకు ఒకరోజు ముందు సిమ్‌స్వాపింగ్‌ను పూర్తిచేస్తారు. ఇందుకోసం ఎక్కువగా శనివారాలను ఎంచుకుంటారు. ఆ తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్ మార్చేసి కంపెనీ బ్యాంకు ఖాతాలో ఉండే సొమ్మును కొల్లగొడతారు. గత ఏడాది జూన్‌లో సైబరాబాద్ పరిధిలోని ఓ వ్యక్తి ఖాతాలోని రూ.4.25 లక్షలు, అక్టోబరులో మరో వ్యక్తి ఖాతాలోని రూ. 6.75 లక్షలను ఈ ముఠా కొల్లగొట్టింది.
ఈ రెండు కేసులపై సీరియస్ గా దృష్టిసారించిన సైబర్‌క్రైమ్ పోలీసుల బృందం ముంబైలో నెలరోజుల పాటు మకాం వేసి.. ఐదుగురు నిందితులను అరెస్టు చేశామని సీపీ సజ్జనార్ తెలిపారు. నిందితుల వద్ద నుంచి 40 నకిలీ ఆధార్ కార్డులు, 4 రౌడ్‌సీల్ రబ్బర్ స్టాంపులు, 15 సెల్‌పోన్లు, వివిధ కంపెనీలకు చెందిన 7 లెటర్‌హెడ్స్‌ను స్వాధీనం చేసుకుని సజ్జనార్ తెలిపారు. ప్రధాన నిందితుడు జేమ్స్ మినహా.. ముంబైలోని మీరారోడ్ గ్యాంగ్ అంతా అరెస్టయిందని సీపీ సజ్జనార్ వెల్లడించారు.
సిమ్ స్వాపింగ్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించి.. పరోక్షంగా సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న జియో నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సజ్జనార్ ప్రకటించారు. గతంలో కూడా ఇలాంటి కేసుల్లో ఎయిర్‌టెల్ సిబ్బంది ఇద్దరిని అరెస్టు చేసినట్లు గుర్తుచేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com