SINGARENI: సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ

SINGARENI: సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ
ఐదు ఏరియాల్లో విజయబావుటా.... ఆరు చోట్ల ఐఎన్‌టీయూసీ గెలుపు

సింగరేణిలో ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా ఆవిర్భవించింది . సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐదు ఏరియాల్లో ఏఐటీయూసీ, ఆరుచోట్ల ఐఎన్‌టీయూసీ ప్రాతినిధ్య సంఘాలుగా గెలుపుబావుటా ఎగురవేశాయి. ఆరేళ్లుగా అధికారిక గుర్తింపు సంఘంగా ఉన్న తెలంగాణ బొగ్గు గని సంఘం ఉనికి కోల్పోయింది. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల ఘట్టం ప్రశాంతంగా ముగిసింది. గెలిచిన అభ్యర్థులకు మద్దతుగా కార్మికులు సంబరాలు చేసుకున్నారు. సింగరేణిలో ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా అవతరించింది. ఆరేళ్లుగా అధికారిక గుర్తింపు సంఘంగా ఉన్న తెలంగాణ బొగ్గు గనుల సంఘం ప్రాభవం కోల్పోయింది. ఐఎన్‌టీయూసీ ప్రాతినిధ్య సంఘంగా సత్తాచాటింది.

దక్షిణ భారతదేశంలో బొగ్గు ఉత్పత్తి చేసే ఏకైక ప్రభుత్వ సంస్థ సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సంస్థలో 2017-ఎన్నికల్లో కేవలం రెండు డివిజ‌న్లలో ప్రాతినిధ్య సంఘంగా ఉన్న సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ ఇప్పుడు ఐదు డివిజ‌న్లలో గెల‌వ‌డ‌మే కాకుండా... ఎక్కువ ఓట్లు సాధించి గుర్తింపు సంఘంగా నిలిచింది. ఆ ఎన్నికల్లో పోటీలో లేని కాంగ్రెస్ అనుబంధ ఐఎన్‌టీయూసీ ఇప్పుడు ఆరు చోట్ల గెలిచి ప్రాతినిధ్య హోదా ద‌క్కించుకుంది. అప్పట్లో 9 స్థానాల్లో గెలిచిన భారాస అనుబంధ TBGKS ఇప్పుడు నామమాత్ర ప్రభావానికే పరిమితమైంది.

మొత్తంగా సింగేరేణి ఎన్నికల్లో 11 ఏరియాలు ఉండగా... ఐదు ఏరియాల్లో ఏఐటీయూసీ, ఆరుచోట్ల ఐఎన్‌టీయూసీ ప్రాతినిధ్య సంఘాలుగా గెలుపొందాయి. బెల్లంపల్లి రీజియన్‌ పరిధిలోని బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్‌ ఏరియాల్లో ఏఐటీయూసీ విజయం సాధించింది. రామగుండం రీజియన్‌లోని రామగుండం-1, 2 ఏరియాల్లో ఏఐటీయూసీ, రామగుండం-3లో ఐఎన్‌టీయూసీ విజయం సాధించింది. కొత్తగూడెం కార్పొరేట్‌, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, భూపాలపల్లి ఏరియాల్లో ఐఎన్‌టీయూసీ గెలుపొందాయి. ఆరు జిల్లాల్లోని 11 ఏరియాల్లో... బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రశాంతంగా పోలింగ్‌ జరిగింది. మొత్తం 39,773 ఓట్లకు గాను 37,468 ఓట్లు పోలయ్యాయి. 94.20 శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యధికంగా ఇల్లెందు ఏరియాలో 98.37 శాతం, అతి తక్కువగా శ్రీరాంపూర్‌, రామగుండం-3 ఏరియాల్లో 93 శాతం ఓట్లు పోలయ్యాయి.

ఎన్నికల్లో గెలిచిన సంఘాల నాయకులు, కార్మికులు సంబరాల్లో మునిగిపోయారు. విజయానికి మద్దతు పలికిన కార్మికులకు విజేతలు ధన్యావాదాలు తెలిపారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో ఏఐటీయూసీ కార్మిక సంఘ నేతలు, కార్మికులు బాణసంచా కాల్చుతూ గెలుపుపై హర్షం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లోని కౌంటింగ్ హాల్ వద్ద సింగరేణి కార్మికులు, ఏఐటీయూసీ కార్మిక సంఘ నాయకులు బానసంచా పేలుస్తూ సంబరాలు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య.. తమపై నమ్మకంతో గెలిపించిన కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. కార్మికుల హక్కుల కోసం అహర్నిశలు కృషి చేస్తామని అన్నారు.


Tags

Read MoreRead Less
Next Story