SIR: తెలంగాణలోనే తదుపరి "ఎస్ఐఆర్"

తెలంగాణలో ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియపై భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే తెలంగాణలో ఓటరు జాబితా ప్రక్షాళన (ఎస్ఐఆర్) చేపడతామని ప్రకటించారు. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియను అందరం కలిసి విజయవంతం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం తెలంగాణ పర్యటనలో ఉన్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఆదివారం (డిసెంబర్ 21) హైదరాబాద్ రవీంద్రభారతిలో బూత్ లెవెల్ ఆఫీసర్లతో సమావేశం అయ్యారు. బిహార్‌లో బీఎల్వోలు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను విజయవంతంగా నిర్వహించి దేశానికి మార్గదర్శనం చేశారని ఆయన తెలిపారు. తదుపరి అదే ప్రక్రియను తెలంగాణలో అమలు చేయబోతున్నామని స్పష్టం చేశారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో బూత్ లెవెల్ ఆఫీసర్లతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఇంటరాక్టివ్ సమావేశం నిర్వహించారు. ప్రపంచానికి మార్గనిర్దేశం చేసే స్థాయికి భారత కేంద్ర ఎన్నికల సంఘం ఎదిగిందని, రాబోయే ఒక సంవత్సరం పాటు అంతర్జాతీయ ‘ఇంటర్నేషనల్ ఐడియా’ సంస్థకు కేంద్ర ఎన్నికల కమిషనరే నాయకత్వం వహించనున్నారని వెల్లడించారు.
కెనడా దేశం కంటే తెలంగాణలోనే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. అంత పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉన్న రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత బీఎల్వోలపై ఉందన్నారు. దేశంలో ఎన్నికల నిర్వహణ కోసం 1.80 కోట్ల మంది సిబ్బంది పనిచేస్తున్నారని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల యంత్రాంగమని పేర్కొన్నారు. బిహార్‌లో ఎన్నికలను 7 దేశాల నుంచి వచ్చిన 20 మంది ప్రతినిధులు పరిశీలించారని, అంతర్జాతీయంగా భారత ఎన్నికల వ్యవస్థకు గుర్తింపు లభించిందని చెప్పారు. బిహార్‌లో విజయవంతంగా ఎస్ఐఆర్ నిర్వహించి బీఎల్వోలు దేశానికి మార్గదర్శనం చేశారని ప్రశంసించారు. ఎస్ఐఆర్ నెక్ట్స్ చేయబోయేది తెలంగాణలోనేనని స్పష్టం చేశారు.
కెనడా దేశం కంటే తెలంగాణ పెద్దదని, ఇక్కడ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ను చక్కగా చేయాలని బీఎల్వోలకు సూచించారు. ఎస్ఐఆర్ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత 7.5 కోట్ల ఓటర్లతో జాబితా విడుదల చేశామని, ఈ ప్రక్రియపై ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని తెలిపారు. ఎన్నికల అనంతరం రీకౌంటింగ్ విషయంలో కూడా సున్నా ఫిర్యాదులే వచ్చాయని, దీనికి కారణం బీఎల్వోల సమర్థ పనితీరేనని ప్రశంసించారు.తెలంగాణలో ఒక బీఎల్వోకు సగటున 930 మంది ఓటర్లు ఉంటారని తెలిపారు. ఎస్ఐఆర్ సమయంలో చనిపోయిన వారి పేర్లు, డబుల్ ఓట్లు వంటి లోపాలు బయటపడతాయని, అలాంటి లోపాలను సరిచేయడానికే ఎస్ఐఆర్ అవసరమని వివరించారు. దేశ రాజ్యాంగానికి అతిపెద్ద సైనికులు బూత్ లెవెల్ ఆఫీసర్లేనని పేర్కొన్నారు.
ప్రస్తుతం దేశంలోని 12 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోందని, భవిష్యత్తులో మిగతా రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తామని తెలిపారు. తెలంగాణలో ఎస్ఐఆర్‌ను అందరం కలిసి విజయవంతం చేద్దామని బీఎల్వోలకు జ్ఞానేశ్ కుమార్ పిలుపునిచ్చారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను తొలుత బిహార్ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా నిర్వహించగా, ఆ ప్రక్రియ అక్కడ పూర్తయింది. రెండో విడతలో ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, కేరళ, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, గోవా, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్‌లలో ఎస్ఐఆర్ నిర్వహిస్తామని అక్టోబర్ 27న ప్రధాన ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

